ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కారులో వెళ్తున్న వీరంతా పెళ్లిచూపులకు నెక్కొండ వెళ్తున్నారు. గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
ధర్మారం గ్రామానికి చెందిన కుంభంపాటి శ్రీనివాస్.. తన అన్న కుమారుడి కోసం పెళ్లి సంబంధం మాట్లాడటానికి మహబూబాబాద్ జిల్లా నెక్కొండకు వెళ్తున్నారు. బంధువులు సుజాత, రమేశ్, జ్యోతితో కలిసి కారులో బయలుదేరారు. గట్టమ్మ ఆలయం సమీపానికి రాగానే కారు అదుపుతప్పి హన్మకొండ డిపోకు చెందిన మేడారం జాతర ప్రత్యేక బస్సును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.