ఈమధ్య మందుబాబులకు ఫ్రీగా మద్యం దొరుకుతోంది. అదెలా అంటారా?. యాక్సిడెంట్ వల్ల. మొన్న బీరు లారీ బోల్తా పడడంతో ప్రకాశం జిల్లా మద్యం ప్రియులు పండుగ చేసుకోగా.. తాజాగా నాగర్ కర్నూల్ మందుబాబుల వంతు వచ్చింది. తిమ్మాజిపేట లిక్కర్ డిపో నుంచి రూ.5 లక్షల మద్యం లోడుతో మినీ డీసీఎం అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి వెళ్తుండగా.. మంతటి చౌరస్తా వద్ద ప్రమాదానికి గురైంది.
వాహనం బోల్తా పడడంతో 40 బీర్ల కాటన్లు, 40 విస్కీ కాటన్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం చుట్టుపక్కల జనాలకు తెలిసింది. అంతే.. ఎవరికి వారు అందినకాడికి మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. సుమారు రూ. 3 లక్షల మద్యం నేలపాలయ్యిందని చెబుతున్నారు.
ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై నాగర్ కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. బీరు బాటిళ్ల లారీ బోల్తా పడింది. కలికివాయి సమీపంలో జాతీయ రహదారిపై మరో లారీ ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. దీంతో స్థానికులు ఆ లారీ పరిస్థితి, అందులో ఉన్న వ్యక్తుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా బాటిళ్ల కోసం ఎగబడ్డారు.
రోడ్డుపై పడ్డ బీరు బాటిళ్లు దొరికినోడికి దొరికినన్ని ఎత్తుకెళ్లారు. ఒక్కొక్కరు పదుల సంఖ్యలో బాటిళ్లను దోచేశారు. శ్రీకాకుళం నుంచి మదనపల్లికి వెళ్తోంది ఆ లారీ. ఇప్పుడు నాగర్ కర్నూల్ లోనూ అదే జరిగింది.