ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు సంబంధిత ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న వారు.. గురువారం మరో షాకింగ్ న్యూస్ తెలిపారు. ఈ ఘటనలో ఓ యువతి తమ కారు చక్రాల్లో ఇరుక్కుపోయిందని తెలుసుకున్న అయిదుగురు నిందితులు.. తమ వాహనాన్ని ఓ పార్కింగ్ లాట్ లో వదిలేసి ఓ ఆటోలో పారిపోయినట్టు కొత్త సీసీటీవీఫుటేజీలో కనిపించింది.
వీరిలో ఒకడు కారు దిగి.. దాని వెనుక భాగంలో ఏముందో చెక్ చేసేందుకు వంగాడు.. అంటే అంజలి మృతదేహం కారు ఎడమ భాగంలోని చక్రంలో ఇరుక్కుపోయినట్టు పోలీసులు సేకరించిన ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. అంజలిని ఈడ్చుకుంటూ తాము కారులో సుమారు 12 కి.మీ. వెళ్లామన్న విషయం వీరికి తెలుసునన్న విషయం స్పష్ఠమైందని భావిస్తున్నారు.
సాక్ష్యాధారాలను దాచిపెట్టేందుకు వీరు యత్నిస్తున్నారని పోలీసులు ధృవీకరిస్తున్నారు. అసలు తమకేమీ తెలియదని వీరు మొదట్లో అబధ్దం చెప్పారు. కారు నడిపిన వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసింది. ఈ కేసులో వీరే గాక మరో ఇద్దరు అనుమానితులను ఖాకీలు విచారించనున్నారు. అశుతోష్, అంకుష్ అనే ఇద్దరు వ్యక్తులు .. ఈ కేసులో నిందితుల తప్పు లేదని చెప్పడానికి యత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. అవసరమైతే వారిని అరెస్టు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
అయిదుగురు నిందితులను గురువారం రోహిణి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచగా వారి పోలీసు కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది.