రాజకీయ క్రీడలో చిట్టితల్లి ఆత్మఘోష
– మొత్తానికి కామాంధుడు ఖతం
– వరంగల్ జిల్లాలో..రైలుపట్టాలపై శవం
– ఆత్మహత్య లేదా ఎన్ కౌంటర్ అని…
– ముందే కథనం ప్రచురించిన తొలివెలుగు
– చిన్నారి తల్లికి న్యాయం జరిగిందా?
– ఈ ఘటన కామపిశాచుల్లో మార్పు తెస్తుందా?
– ఎవరి నిర్లక్ష్యం.. ఎవరికి శాపంగా మారింది?
– చెప్పగానే ఖాకీలు స్పందించి తలుపు తీస్తే…
– ఆ చిట్టితల్లి కొన ప్రాణాలతో దక్కేదా..?
హైదరాబాద్, తొలివెలుగు: మానవజాతి మొత్తం సిగ్గుతో తలదించుకునే ఒక హేయమైన ఘటన..బాధితుల ఆక్రందనలు..మీడియా గగ్గోలు..అప్పటిదాకా చోద్యం చూసిన ఖాకీలు, సర్కారు పెద్దలపై ఒత్తిడి. సీన్ కట్ చేస్తే..మళ్లీ అదే దృశ్యం నిన్న వరంగల్ జిల్లా నష్కల్ రైలు పట్టాలపై కనిపించింది.. అంతకుముందు చటాన్ పల్లి వంతెన సమీపంలోని పొలాల్లో కనిపించిది..దానికంటే ముందు మరోటి.ఇలా ఎన్ని జరగాలి..?ఇకనైనా మారరా..?ఎవరూ మారరా..?
ఒక ఆడకూతురు కనిపించటం లేదనగానే ఆఘమేఘాల మీద స్పందించే యంత్రాంగం..తక్షణం రంగంలోకి దిగి ఎట్టి పరిస్థితుల్లో కాపాడితీరతామనే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను మనం ఎప్పటికి చూస్తాం. ఇంకా ఎందరు చిట్టితల్లుల మానాలు పోవాలి..ప్రాణాలు పోవాలి. కీచకుడి శవం పట్టాల మీద కనిపించగానే మనకు సంతోషమా…ఆ పేద గిరిజన తల్లిదండ్రుల గుండెల్లో మంటలు ఆరిపోతాయా..?అసలిలాంటి ఘటనలు ఆపటానికి కదా..ఇన్ని వేల కోట్ల ఖర్చు..మీకు భవనాలు, వాహనాలు..ఓ గొప్పయంత్రాంగం. ఒకానొక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ అయితే ఇద్దరు యాంకర్లను నిలబెట్టి మరీ..అరిచి అరిచి చెప్తోంది.హంతకుడు పశ్చాత్తాపంతోనో..పాపభీతితోనో ఆత్మహత్య చేసుకోలేదట. కేవలం పోలీసుల వ్యూహం, వాళ్ల నాకాబందీని చూసి తట్టుకోలేక..వేరే దారి లేక అలా చచ్చాడట. అంటే ఎవరు ఎవరిని ఎందుకు మోస్తున్నారు..? ఒక్కసారిగా సీన్ లో నుంచి బాధిత కుటుంబం వెళ్లిపోయింది. ఓ పక్క కన్నీరుమున్నీరవుతున్నఆ కుటుంబాన్ని, వాళ్ల మనోభావాలు పక్కనబెట్టేసి..ఎవరి డబ్బా ఎవరు కొడుతున్నారు? ఇలాంటి డబ్బా టీవీ సంస్థ..చూసే జనాన్ని పిచ్చోళ్లనుకుంటుందా..?
అంతా అయిపోయిందా..! మాకు డౌటుంది అయ్యా..ఒక్కసారి నిందితుడి ఇంటి తలుపు తీయండి మొర్రో అంటే తీయని పోలీసులపై ఎవరు చర్యలు తీసుకుంటారు..? మీ నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే..ఘటన జరిగి సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంటే..తాపీగా నాలుగు రోజులకు స్పందించిన మంత్రులు, ఎమ్మెల్యేల సంగతేంటి..? అసలు ఎక్కడ ఎన్నిక జరిగినా..పగలూ రాత్రి అక్కడ ఎలా గెలవాలని తప్ప మరోటి ఆలోచించని సీఎంను ఏం చేయాలి..?ఇంత సీరియస్ ఇష్యూ అయితే.. ఒకసారి నిందితుడిని పట్టుకున్నారని..మరోసారి పట్టుకోలేదు సారీ అనే ఐటీ మంత్రి సంగతేంటి..?అంతే ..ఆ నీచుడి శవం కనబడగానే..సదరు టీవీ ఛానల్ ఊదరగొట్టేస్తుంది..ఎవరో ఏదో సాధించినట్టు..? ఏం సాధించారు..? దిశ ఘటన తర్వాత మరో తల్లి కడుపుకోతకు గురికాకుంటే మనం ఎంతో కొంత సాధించినట్టు..అంతేకానీ.. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా.. చిన్నారి హత్యాచారం తర్వాత కూడా..అవే మిస్సింగ్ లు, అత్యాచారాలు.. హత్యలు.. మరెందుకు ఊదరగొడుతున్నారు..?సిగ్గుపడండి, తలదించుకోండి..ఇంకోసారి మనమధ్యే ఓ తల్లికో, చెల్లికో, ఓ ముక్కపచ్చలారని చిన్నారికో ఏమీ జరగని ఒక వాతావరణం సృష్టించటానికి ఏం చేయాలో ఆలోచించండి..అంతే కానీ ఒక చావుతో అన్నీ సెట్ అయ్యాయని మాత్రం జనాల్ని మభ్య పెట్టొద్దు.