సంచలనం రేపిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు ఏ1 సాదుద్దీన్ ను చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. అత్యాచార ఘటనను సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు.
పబ్ లో జరిగిన ఘటన బాలికను ట్రాప్ చేసిన అంశాలపై సాదుద్దీన్ ను విచారించనున్నారు. నాంపల్లి కోర్టు బుధవారం సాదుద్దీన్ పోలీస్ కస్టడీకి అనుమతించింది. పోలీసులు ఏడు రోజులు కావాలని కోరినా.. మూడు రోజులకే ఓకే చెప్పింది. సాదుద్దీన్ మేజర్ కావడంతో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అక్కడి నుంచి అతడ్ని కస్టడీకి తీసుకున్నారు.
నిందితుల్లో మిగిలిన ఐదుగురు మైనర్లు. సీపీ చెప్పిన వివరాల ప్రకారం.. బాలికపై మొత్తం ఐదుగురు అత్యాచారం జరపగా.. మరో మైనర్ వేధింపులకు గురి చేశాడు. ఈ విధంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే కేసులో ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు పోలీసులు. బాలిక నుంచి రెండు సార్లు స్టేట్ మెంట్ తీసుకున్నారు. సాదుద్దీన్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి తీసుకున్నారు.
నిందితుడి కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు. తర్వాత రిమాండ్ కు తరలిస్తారు. ఈ కేసుపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ దృష్టి పెట్టిన నేపథ్యంలో పోలీసులు దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే కుమారుడిని ఆరో నిందితుడుగా పేర్కొన్నారు గానీ.. అతను అత్యాచారం చేయలేదని చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు.