చేసేది సాఫ్ట్ వేర్ కొలువు, వేలల్లో జీతం వస్తుంది. కాకపోతే లక్షల్లో ఖర్చు పెట్టే లక్షణం ఉంది. ఎందుకంటే మనోడికి క్రికెట్ అంటే పిచ్చి, బెట్టింగ్ ఓ వ్యసనం. కనుక అందినకాడికి అప్పులు చేసాడు. తీర్చాలంటే సాఫ్ట్ వేర్ ఆదాయం ఏం సరిపోతుంది. అప్పులు తీర్చడానికి చాలా రోజులు జుట్టు పీక్కున్నాడు. మెరుపులాంటి ముదనష్టపు ఐడియా ఒకటి వచ్చింది. దొంగతనాలే దగ్గరిదారి అనుకున్నాడు. చివరికి పోలీసులకు పట్టుపడ్డాడు. ఈఘటన మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం పాతపట్నం ప్రాంతానికి చెందిన సవన మనోజ్ కుమార్ ఎంబీఏ పూర్తి చేసి ప్రగతినగర్ లేక్ వ్యూ కాలనీలో ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసైన అతడు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేవాడు. 5 నుంచి 10 శాతం వడ్డీకి అప్పులు తీసుకుని మరీ బెట్టింగ్‌లు వేసి ఓడిపోయాడు.
ఆ అప్పులు తీర్చేందుకు సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గత నెల 31వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిజాంపేట శ్రీనివాస కాలనీలోని శ్రీ బాలాజీ రెసిడెన్సీకి చెందిన ఓ వృద్ధురాలు స్వర్ణలత సాయిబాబా ఆలయానికి వెళ్లింది.
పూజ ముగించుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో వెంబడించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మనోజ్ కుమార్ లిఫ్ట్ దగ్గర చైన్ పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించాడు. ఆమె అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శశిగూడలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసీపి చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. మియాపూర్‌లో చోరీ చేసిన స్కూటీ, రెండున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.