తప్పతాగి రోడ్డు యాక్సిడెంట్ చేసాడని పట్టుకుంటే ఏకంగా ఎస్సై చెవే కొరికేసాడో వ్యక్తి. ఈ అనూహ్య సంఘటన కేరళలోని కాసరగాడ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసరగాడ్ లో బైక్ పై వెళ్తున్న స్టెనీ రోడ్రిగ్జ్ అనే వ్యక్తి ఒక వాహనాన్ని ఢీకొట్టాడు.ఈ ప్రమాదంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు.అంత వరకూ బాగానే ఉంది.
పోలీసు వాహనంలో అతన్ని పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు. ఎస్ఐ విష్ణు ప్రసాద్ పోలీస్ వాహనంలో ముందు సీటులో కూర్చున్నాడు. అయితే వెనుక కూర్చున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎస్ఐ కుడి చెవిని కొరికాడు. దీంతో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, రోడ్డుపై ప్రమాదం చేయడంతో పాటు ఎస్ఐ చెవి కొరికిన నిందితుడు స్టెనీ రోడ్రిగ్జ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.