ఓ కవి తన తుది శ్వాస వరకు కలానికి, గళానికి బానిసగానే బతుకుతాడు. ఆకలి చావులను, కన్నీటి గాధలను తన అక్షరాలతో ప్రపంచానికి పరిచయం చేస్తాడు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా బాధనంతా కవిత్వం రూపంలో రాసుకొని కన్నీటిని కనిపించకుండా దాచుకుంటాడు. అలాంటి ఓ గొప్ప కవిని తెలుగు ప్రజలు కోల్పోయారు.
ప్రముఖ కవి, దళిత సాహితీ రథసారథి, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యునిగా సేవలందించి ఎందరో విద్యార్థులకు, పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచారు.
ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి దంపతులకు 21 జనవరి1959 సంవత్సరంలో అమ్మమ్మగారి ఊరయిన నిజామాబాద్ జిల్లా పాముల బస్తీలో జన్మించిన సుధాకరరావు. వీధి బడి చదువు నుంచి విశ్వవిద్యాలయ చదువు వరకు హైదరాబాద్ లోనే పూర్తిచేసుకుని.. తెలుగు ఉపాధ్యాయునిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన విశ్వవిద్యాలయ ఆచార్యునిగా ఎదిగారు. ప్రవృత్తిగా తెలుగు కవితా దిగ్గజంగా సాహితీలోకంలో విశేషమైన కృషి చేసి.. తెలుగు దళిత కవిత్వంలో తనదైన ముద్రను వేసుకున్నారు.
వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా, తొలి వెన్నెల మొదలైన రచనలతో తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు. వీరి కుటుంబం కూడా తెలుగు సాహిత్యంతో పెనవేయబడింది.. తన భార్య దివంగత హేమలత కూడా రచయిత్రి సామాజిక సేవకురాలు కాగా.. కుమార్తె ఎండ్లూరి మానస చక్కటి కథా రచయిత్రి. తను రాసిన కథా సంపుటి “మిళిoద” కు 2020 లో కేంద్ర సాహిత్య యువపురస్కారం లభించింది.
తన జీవిత భాగస్వామి హేమలత 2019లో మరణించిన నాటి నుండి సుధాకర్ తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. ఒకా నొక సందర్భంలో నాకూ కరోనా వచ్చి హేమ చెంతకు చేరిస్తే బాగుండును.. అంటూ తన నిర్వేదన భావాన్ని వ్యక్తపరిచారు. ఎంతో భవిత గల ఎండ్లూరి అకాల మరణానికి ప్రముఖులు అశ్రు నివాళులు అర్పించారు.