ఓ పెద్ద సినిమా వస్తుందంటే.. అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతుంది. ఆర్ఆర్ఆర్ రిలీజైనప్పుడు వారం రోజులకు సరిపడ టిక్కెట్లు అడ్వాన్స్ గా అమ్ముడుపోయాయి. కేజీఎఫ్2, రాధేశ్యామ్ రిలీజైనప్పుడు కూడా అదే పరిస్థితి. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఆచార్య సినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగింది. అయితే ఆ తర్వాతే వ్యవహారం తేడా కొట్టింది. ఓవర్సీస్ లో ఆచార్యకు పెద్ద అవమానం జరిగింది.
తెలుగు రాష్ట్రాల కంటే జోరుగా ఓవర్సీస్ లో ఆచార్యకు అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. అక్కడ 21 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ జరగడంతో చాలా టిక్కెట్లు తెగాయి. అయితే సినిమాకు అక్కడ కూడా ఫ్లాప్ టాక్ వచ్చేసింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న చాలామంది ప్రేక్షకులు వాటిని రద్దు చేసుకున్నారు. తమ డబ్బులు వెనక్కి తెచ్చుకున్నారు.
ఓ పెద్ద సినిమాకు ఇలా జరగడం ఓవర్సీస్ లో ఇదే తొలిసారి. రాధేశ్యామ్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పుడు కూడా ఇలా జరగలేదు. ఆచార్య విషయంలో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ కాన్సిల్ అయ్యాయి. ఈ ప్రభావం, ఈరోజు-రేపటి వసూళ్లపై స్పష్టంగా కనిపించబోతోంది.
ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అటుఇటుగా 8 లక్షల డాలర్ల వద్ద మాత్రమే ఆచార్య ఆగిపోయింది. ఈరోజు ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది.
ఓవర్సీస్ లో ఆల్ టైమ్ హయ్యస్ట్ వసూళ్లు అందుకున్న టాప్-10 సినిమాల జాబితాలోకి ఆచార్య ఎంటర్ అవుతుందని అంచనాలుండేవి. ఈ సినిమా రాకతో ఆ లిస్ట్ మారుతుందని కూడా చాలామంది అనుకున్నారు. కానీ ఆచార్య ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇది టాప్-10 లిస్ట్ లోకి ఎంటరైనప్పటికీ.. మొదటి 5-6 సినిమాలపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేనట్టే.