చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. రేపట్నుంచి ఈ సినిమా హంగామా మొదలుకాబోతుంది. రేపు ఆచార్య ట్రయిలర్ రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి భారీగా ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఆచార్య ట్రయిలర్ ను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు థియేటర్ల లిస్ట్ కూడా బయటకొచ్చింది. ఆయా ప్రాంతాల్లోని మెగా ఫ్యాన్స్ అందరికీ సమాచారం కూడా వెళ్లింది.
ట్రయిలర్ లాంఛ్ అయిన తర్వాత సరిగ్గా వారం రోజులు గ్యాప్ ఇచ్చి మరో హంగామాకు సిద్ధంకాబోతోంది ఆచార్య. ఈ సినిమాలో చరణ్-చిరంజీవి కలిసి చేసిన సాంగ్ ఒకటి ఉందట. ఆ పాటను 20వ తేదీన విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. లిరికల్ వీడియోగా రిలీజ్ చేయబోతున్నప్పటికీ, అందులో చిరు-చరణ్ కలిసి వేసిన సిగ్నేచర్ స్టెప్ ను కూడా ఉంచబోతున్నారట.
ఇక ఈ సాంగ్ రిలీజైన 3 రోజులకు.. అంటే 23వ తేదీన ఆచార్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయబోతున్నారు. అయితే ఈ వేడుకకు వేదికను ఇంకా ఖరారు చేయలేదు. హైదరాబాద్ లోనే చేయాలా లేక విజయవాడ/వైజాగ్ లో చేయాలా అనే అంశాన్ని ఇంకా తేల్చలేదు. పైగా ప్రత్యేక అతిథిగా ఎవర్ని పిలవాలనే అంశఁపై కూడా చర్చలు సాగుతున్నాయి.
ఈమధ్య చిరంజీవి రాజకీయంగా తటస్థంగా ఉంటున్నారు. ఏ పార్టీకి కొమ్ముకాయడం లేదు. స్వయంగా తమ్ముడు పవన్ కల్యాణ్ నడిపిస్తున్న జనసేన పార్టీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇలాంటి టైమ్ లో తమ్ముడు పవన్ కల్యాణ్ ను అతిథిగా పిలిస్తే, ఇబ్బందికరంగా ఉంటుందని చిరంజీవి భావిస్తున్నారట. అందుకే తమ్ముడు కాకుండా, మరో స్టార్ ను ఆహ్వానించే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు తెలుస్తోంది.