ఆచార్య ప్రమోషన్ పీక్ స్టేజ్ కు చేరింది. ఇన్నాళ్లూ రిలీజ్ చేసిన సాంగ్స్ ఒకెత్తు, ఈరోజు రిలీజైన సాంగ్ మరో ఎత్తు. ఎందుకంటే, ఈ పాటలో మెగా తండ్రికొడుకులు చిరంజీవి, చరణ్ కలిసి డాన్స్ చేశారు. అందుకే ఈ సాంగ్ ను సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు బయటపెట్టాలని ఇన్నాళ్లూ ఆపారు. ఇప్పుడు బయటకు వదిలారు
మణిశర్మ కంపోజిషన్ లో వచ్చింది భలే భలే బంజారా సాంగ్. శంకర మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటలో అంతా ఊహించినట్టుగానే చిరు-చరణ్ తమ డాన్స్ తో చించి పడేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చిన ఈ పాటలో తండ్రికొడుకులు వేసిన 3 స్టెప్స్ ను మచ్చుకు వదిలారు. కీలకమైన సిగ్నేచర్ స్టెప్ ను కూడా లిరికల్ వీడియోలోనే చూపించడంతో.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఆచార్య సినిమాకు సంబంధించి ఇప్పటికీ కొన్ని పాటలు బయటకొచ్చాయి. అవన్నీ హిట్టయ్యాయి. ఇప్పుడు బంజారా సాంగ్ కూడా వచ్చింది. మరో 5 రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సెలబ్రేట్ చేయబోతున్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకకు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తారనే ప్రచారం సాగుతోంది.
వరల్డ్ వైడ్ ఆచార్య సినిమా 113 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానెల్ 29 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అటు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ 25 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఇదే. ఈనెల 29న థియేటర్లలోకి వస్తున్నాడు ఆచార్య.