ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలైంది. ఆచార్య సినిమా గత వారమే థియేటర్లలోకి వచ్చింది. అలాంటప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది. కానీ ఊహించని విధంగా పోటీ ఏర్పడింది. ఓటీటీలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ పోటీ పడబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాను ఈనెల 20న జీ ప్లెక్స్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. నిర్ణీత రుసుము చెల్లించి జీ ప్లెక్స్ యాప్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూడొచ్చు. దాదాపు అదే టైమ్ లో ఆచార్య సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు పెట్టాలని నిర్ణయించారట. దీంతో ఆచార్య, ఆర్ఆర్ఆర్ మధ్య పోటీ ఏర్పడినట్టయింది.
ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకొచ్చి 40 రోజులు దాటింది. ఇప్పటికే చాలామంది చూసేశారు. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఇలాంటి టైమ్ లో ఈ సినిమాను మరోసారి డబ్బులు చెల్లించి ఓటీటీలో ఎవరు చూస్తారనేది అనుమానమే. కాకపోతే ఇది వారం, 10 రోజుల పాటే ఉంటుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ను నేరుగా జీ5లో స్ట్రీమింగ్ కు పెట్టేస్తారు. సబ్ స్క్రైబర్లంతా చూసుకోవచ్చు.
ఆచార్య సినిమాది మరో కథ. లెక్కప్రకారం ఈ సినిమా జూన్ లో స్ట్రీమింగ్ కు రావాలి. కానీ థియేటర్లలో సినిమా ఫ్లాప్ అవ్వడంతో, కాస్త ముందుగానే ఈనెల 20న ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు అమెజాన్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు మేకర్స్ కు అదనంగా 18 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సంస్థ అంగీకరించింది.
ఇలా ఊహించని విధంగా ఇటు ఆచార్య, అటు ఆర్ఆర్ఆర్ సినిమాలు ఒకే టైమ్ లో ఓటీటీలోకి వస్తున్నాయి. నిజానికి ఓటీటీలో పోటీ అనేది ఉండదు. ఎవరైనా తమకు నచ్చినట్టు, నచ్చిన టైమ్ లో నచ్చిన సినిమా చూసుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ రావడం ఆచార్యకు ఓటీటీలో ఎదురుదెబ్బ అంటున్నారు చాలామంది.