పేరుకు మెగాస్టార్ సినిమా. మెగా పవర్ స్టార్ కూడా నటించిన సినిమా. స్టార్ డైరక్టర్, స్టార్ హీరోయిన్ ఉన్న ప్రాజెక్టు. ఇన్ని హంగులు ఉన్నప్పటికీ, ఆచార్య సినిమా సకాలంలో బిజినెస్ పూర్తిచేయలేకపోయింది. మరీ ముఖ్యంగా శాటిలైట్ డీల్ ను ఈ సినిమా లాక్ చేయలేకపోయింది. ఎట్టకేలకు ఆ పని కూడా పూర్తయింది.
ఆచార్య శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానెల్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులు దక్కించుకునేందుకు అన్ని ఛానెళ్లు పోటీ పడ్డాయి. కానీ ఆచార్య మేకర్స్ చెప్పిన రేటు చూసి దాదాపు అన్నీ వెనక్కి తగ్గాయి. అయితే ఛానెల్స్ వెనక్కితగ్గినప్పటికీ, మేకర్స్ మాత్రం వెనక్కుతగ్గలేదు. రేటు తగ్గించలేదు. అందుకే శాటిలైట్ డీల్ సెట్ అవ్వడం చాలా ఆలస్యమైంది. ఇప్పుడిది జెమినీ చెంతకు చేరినట్టు తెలుస్తోంది
చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. దాదాపు 35 కోట్ల రూపాయలకు ఈ అగ్రిమెంట్ కుదిరినట్టు తెలుస్తోంది.
ఏప్రిల 1న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. గతంలో సినిమా లాంఛ్ అయినప్పుడు భారీ రేట్లకు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మారు. అయితే కరోనా రావడం, ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం, ఆక్యుపెన్సీ పడిపోవడంతో.. ఆచార్య రేట్లు సవరించారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఏపీలో టికెట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆచార్య సినిమాను పాత రేట్లకే అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నారు.