ఆచార్య డిజాస్టర్ తో ఓవైపు బయ్యర్లంతా గగ్గోలు పెడుతున్న టైమ్ లో, చిరంజీవి విహార యాత్రకు వెళ్లారు. తన భార్యతో కలిసి ఆయన ఓ చిన్న హాలిడే ట్రిప్ పెట్టుకున్నారు. దీంతో ఇప్పుడు ఆచార్య సెటిల్మెంట్ వ్యవహారాలన్నీ దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డిలపై పడింది. మరో వారం రోజుల్లో వీళ్లంతా కూర్చుంటారంటూ ఊహాగానాలు చెలరేగాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికే సెటిల్మెంట్ ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది.
బయ్యర్లందరితో కొరటాల-నిరంజన్ మాట్లాడి, తుది సారాంశాన్ని రామ్ చరణ్ కు చేరవేస్తారు. రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బయ్యర్లకు వివిధ రూపాల్లో హామీ అందించబోతున్నారు. కొందరికి డబ్బులు వెనక్కి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరికొందరికి చిరంజీవి, రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాల రైట్స్ ను తక్కువలో అందించేలా హామీ ఇవ్వబోతున్నారు. ఇటు కొరటాల కూడా తన స్థాయిలో ఎన్టీఆర్ సినిమా రైట్స్ ఇప్పించేలా హామీ ఇస్తున్నాడు.
ఈ మొత్తం వ్యవహారంలో తేలాల్సిన అసలైన అంశం ఇంకోటి ఉంది. ఆచార్య సినిమాకు సంబంధించి తనింకా రెమ్యునరేషన్ తీసుకోలేదని స్వయంగా కొరటాల ప్రకటించాడు. అటు చిరు-చరణ్ కూడా పేమెంట్స్ తీసుకోలేదనేది ఇంటర్నల్ టాక్. బయ్యర్లను న్యాయం చేసిన తర్వాత, వీళ్ల పారితోషికాల సంగతి తేల్చబోతున్నారు. తనకు ఎలాంటి పేమెంట్ అక్కర్లేదని కొరటాల చెప్పే అవకాశాలున్నాయి.
ఆచార్య సినిమాకు ప్రస్తుతం కలెక్షన్లు రావడం లేదు. మరో వారం, 10 రోజుల్లో ఈ సినిమా క్లోజింగ్ దశకు చేరుకుంటుంది. బయ్యర్లకు దాదాపు 90 కోట్ల రూపాయల మేరకు నష్టాలు వచ్చేలా కనిపిస్తోంది. అటు అమెజాన్ సంస్థలో ఈ సినిమాను ఒప్పంద తేదీ కంటే ముందుగానే స్ట్రీమింగ్ కు ఇవ్వడం ద్వారా అదనంగా మరో 18 కోట్ల రూపాయలు అందుకోబోతున్నాడు నిర్మాత నిరంజన్ రెడ్డి.