కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలక పాత్రలో నటించారు. అయితే, ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘ఆచార్య’ సినిమా సందడి చేయనుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ మంగళవారం సాయంత్రం 5.49కి థియేటర్లలో విడుదలైంది. దాదాపుగా 152 థియేటర్లలో ‘ఆచార్య’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ట్రైలర్‌ను వీక్షించేందుకు మెగా అభిమానులు తండోపతండాలుగా థియేటర్ల వద్ద క్యూ కట్టారు.
‘ఇక్కడ అందరూ సౌమ్యులు..పూజలు, పురస్కరాలు చేసుకుంటూ..కష్టాలొచ్చినపుడు అమ్మోరు తల్లి మీద భారమేసి..బిక్కుబిక్కుమని ఉంటామేమోనని పొరబడి ఉండొచ్చు..ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది’ అంటూ రామ్ చరణ్ డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని భారీగా పెంచుతున్నాయి.
అలాగే, ‘పాదఘట్టం వాళ్ల గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలట.. కాకపోతే అది ఏ కాలా..? నేనొచ్చానని చెప్పాలనుకున్నా.. కానీ చేయడం మొదలుపెడితే’ అని విలన్‌తో చిరు చెప్తున్న డైలాగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా కనిపిస్తున్నాయి. ఇక సినిమా అంతా ధర్మస్థలి అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
‘ఆచార్య’ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్క అభిమాని నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న సన్నివేశాలు తమకు కన్నుల పండుగగా ఉన్నాయని వారు అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ‘ఆచార్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు.