రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కునేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ప్రకటించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. రాబోయే ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలిచి చంద్రబాబు సీఎం కాబోతున్నారని జోశ్యం చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో గడప గడపకు వైసీపీ అని పెడితే ప్రజలు వెంటపడతారని హెచ్చరించారు.
బాదుడే బాదుడు కార్యక్రమంతో టీడీపీ ప్రజల వద్దకు వెళ్తూ.. వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రజలకు వివరిస్తోందనే భయం వైసీపీ నేతల్లో మొదలైందని వ్యాఖ్యానించారు. టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలతో ఇక ఓటమి తప్పదనే భయంతో వైసీపీ నేతలు కార్యక్రమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
వైసీపీకి అసలు రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హతే లేదన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ ఓ గాలి పార్టీ అని.. గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ నుండి వచ్చి జగన్ దొంగ లెక్కలు రాసే ఒకరికి.. సీబీఐ కేసులు వాదించే ఇంకొకరికి రాజ్యసభ సీట్లు ఇచ్చారని సెటైర్లు వేశారు.
Advertisements
బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలు.. ఈ బంధాన్ని జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా విడదీయలేరని స్పష్టం చేశారు. పదవులు ఇచ్చి బీసీల నోటికి ప్లాస్టరు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చారని సెటైర్లు వేశారు అచ్చెన్నాయుడు.