ప్రభుత్వానికి వంత పాడుతూ కొందరు పోలీసులు అరాచకాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు తరచూ విమర్శలు చేస్తుంటారు. గృహనిర్బంధాలు, ధర్నాలను అడ్డుకోవడంతో వారంతా అలా రియాక్ట్ అవుతూ ఉంటారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారారని కొన్ని సందర్భాల్లో తీవ్రస్థాయిలో తిట్టిపోస్తుంటారు. అయితే.. అందరూ అలా ఉండరని నిరూపించారు ఓ పోలీస్.
ప్రజల క్షేమం కోసమే తామున్నామని చాటిచెప్పారు ఏసీపీ ఫణిందర్. ప్రస్తుతం ఈయన నర్సంపేటలో విధులు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా కొమ్మల దగ్గర వేగంగా వెళ్తున్న ఓ లారీ తగిలి కరెంట్ తీగలు తెగి పడ్డాయి.
రోడ్డుపై అడ్డంగా పడిపోయిన కరెంట్ తీగలను చూసి ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో అక్కడకు వచ్చిన ఏసీపీ ఫణిందర్. సిబ్బంది ఉన్నా కూడా వారితో కాకుండా తానే స్వయంగా ఓ కర్ర సాయంతో కరెంట్ తీగలను తొలగించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫణిందర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సలాం పోలీస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.