ఇచ్చేవాడుంటే సచ్చేవాడు కూడా లేచొస్తాడని సామెత..! ఆఫర్లంటే చాలు చెవులు మెదులుతాయ్. గాలిమేడలు కట్టడంలో బిజీఅయిపోతాం. బుర్రపనిచేయడం మానేస్తుంది. మన అత్యాశను సైబరాసురులు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అకౌంట్ మొత్తం స్వాహా చేసేస్తారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఇలాంటి మెసేజ్ లకు అట్రాక్ట్ అయ్యి క్లిక్ చేస్తే హ్యాపీగా మొదలవ్వాల్సిన కొత్తసంవత్సరం ఏడుపుగా మొదలవుతుంది. న్యూ ఇయర్ వేడుకల మెస్సేజులతో తస్మాత్ జాగర్త అంటున్నారు సైబర్ నిపుణులు.
కొత్త ఏడాది మజాయే వేరు.దీని కోసమే కాచుకున్న కేటుగాళ్ళు..ఫోన్లకు ఎస్ఎమ్ఎస్ లు, లింకు పంపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నారు.డిసెంబరు 31, 2023 జనవరి 1 న ఇష్టమైన వారితో గడిపేందుకు అద్భుతమైన అవకాశం ఊరిస్తున్నారు.
ముందుగా కొంత మేర అడ్వాన్స్ చెల్లిస్తే సీటు రిజర్వ్ చేస్తామంటారు. విదేశీ మద్యం తక్కువ ధరకు ఒక్క క్లిక్ తో మీ ఇంటి గుమ్మం వద్దకు చేరవేస్తాం. డీజే, అందమైన అమ్మాయిలు,ఇష్టమైన ఫుడ్ “అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ ‘’ నక్షత్రాల హోటళ్ళలో తిథ్యం ఇచ్చేందుకు మేము రెడీ అంటూ ఊరిస్తున్నారు.
ఢిల్లీ, ముంబై నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలకు రాయితీలంటూ ప్రకటనలు గుప్పించి చాలా మందిని ముంచేస్తున్న కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
నకిలీ వెబ్ సైట్స్ …సామాజిక మాధ్యమాల వేదికగా ఆకట్టుకునే ప్రకటనలతో సైబర్ మోసగాళ్ళు ఎత్తులు వేస్తుంటారు. గుర్తు తెలియని ఫోన్ కాల్స్ లేదా మెస్సేజెస్ కు స్పందించవద్దు. ఆఫర్లంటూ వచ్చే లింకులను క్లిక్ చేయగానే ఎనీడెస్క్, టైమ్ వ్యూయర్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోమంటారు.
ఆ రెండూ ల్యాప్ ట్యాప్ లోకి చేరితే..మన ఆన్ లైన్ లావాదేవీలన్నీ సైబర్స్ గుప్పిట్లోకి చేరిపోతాయి. ఒక వేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 నెంబరుకి ఫిర్యాదు చెయ్యమని నిపుణులు సలహాఇస్తున్నారు.