ప్రభుత్వ పాలసీలను విమర్శించే ఉద్యోగులపై పక్కాగా చర్య తీసుకుంటామని జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగం హెచ్చరించింది. ఇలాంటి ఉద్యోగులను గుర్తించేందుకు సోషల్ మీడియా నెట్ వర్క్ లను మానిటర్ చేస్తుండాలని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలను ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఏ.కె. మెహతా ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఉత్తర్వులను జారీ చేశారు.
ప్రభుత్వ విధానాలను తప్పు పట్టే ఉద్యోగులకు నోటీసులు జారీ చేయాలని ఆయన సూచించారు. కొంతమంది సిబ్బంది సర్కారీ పాలసీలను విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అందువల్లే రెగ్యులర్ గా వీటిని పరిశీలిస్తుండాలని ఆయన కోరారు. మెహతా చేసిన సూచనలననుసరించి సంబంధిత జిల్లా కలెక్టర్లంతా అన్ని జిల్లాల కార్యాలయాలలోని సెక్షన్ ఆఫీసర్లకు అత్యవసర సందేశాలను పంపారు.
ఇప్పటికే ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కుతున్నారంటూ కశ్మీర్ లోని విపక్షాలు మండిపడుతుండగా తాజాగా ఇక్కడి పాలనా యంత్రాంగం ఇలా సరికొత్త ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమవుతోంది.
అయితే ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగుల్లో కొందరు ఉగ్రవాద కార్యకలాపాల పట్ల మొగ్గు చూపుతూ టెర్రరిస్టుల సానుభూతిపరులుగా మారుతున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నట్టు కనబడుతోందని అంటున్నారు.