ప్రస్తుతం సినీ నటుడు అలీ వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు. ఇంతవరకూ ఈయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. కానీ, వచ్చే ఎన్నికలకు మాత్రం బరిలోకి దిగాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. కాకపోతే అధినేత జగన్ కే అంతా వదిలేశారు.
గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీని ఈమధ్యే సలహాదారుగా నియమించారు జగన్. ఆ ఊపులో ఉన్న ఆయన.. ఏకంగా పవన్ కళ్యాణ్ పైనే పోటీకి సై అంటున్నారు. జగన్ ఆదేశిస్తే తప్పకుండా జనసేనానిపై పోటీ చేస్తానని చెబుతున్నారు.
తాజాగా తిరుపతిలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ అని ప్రకటించారు. పవన్ తనకు మంచి స్నేహితుడని, సినిమాలు వేరు, రాజకీయాలు వేరని చెప్పుకొచ్చారు.
రాజకీయంగా ఇద్దరు వేర్వేరు దారుల్లో ఉన్నా.. నిజ జీవితంలో అలీ, పవన్ మంచి స్నేహితులు. పవన్ హీరోగా చేసిన ఒకట్రెండు సినిమాలు మినహా.. అన్నింటిలోనూ అలీ నటించారు.