ఓవైపు సినీ హీరోలు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తున్నారు. వీరితో పాటు నటుడు అలీ కూడా జగన్ చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా మరోసారి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు.
అలాగే మంత్రులను కూడా కలిసినట్లు తెలిపారు అలీ. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చానని టికెట్ ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని ఎప్పుడూ అనలేదు అని స్పష్టం చేశారు. 2004లో వైఎస్ పాదయాత్ర చేసిన తర్వాత కలిశానని… సీఎం జగన్ తో కూడా ముందు నుంచి మంచి పరిచయం ఉందని అన్నారు.
మా మ్యారేజ్ డే సందర్భంగా జగన్ ను కలవాలనుకున్నానని… నా భార్య ఎప్పటినుంచో జగన్ తో ఫోటో దిగాలని కోరుతుందని ఇదే విషయం సీఎం తో చెబితే పర్లేదు తీసుకురమ్మన్నారని అన్నారు.
నాకు గతంలో టికెట్ ఇస్తానని అన్న మాట నిజమేనని కానీ నేనే వద్దని చెప్పానన్నారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాలను పక్కన పెట్టాలి. కానీ సమయం కుదర లేదన్నారు.