ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసోంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలీ బారువాను గురువారం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆశిష్ విద్యార్థి వివాహం చేసుకున్నాడు. ఇది ఈయనకు రెండో వివాహం.
గతంలో నటి శకుంతల బారువా కూతురు రాజోషి బారువాను పెళ్లి చేసుకోగా వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు ఉన్నాడు. అయితే.. విబేధాల కారణంగా వీరు విడిపోయారు. కుటుంబ సభ్యులు,సన్నిహితుల సమక్షంలో ఆశిష్, రూపాలిలు రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. తెలుపు, బంగారు రంగు మేఖేలా చాదర్లో రూపాలి అందంగా కనిపించింది. వివాహం అనంతరం ఆశిష్ మాట్లాడుతూ.. నా జీవితంలో ఈ దశలో రూపాలిని వివాహం చేసుకోవడం ఒక అసాధారణ అనుభూతి అంటూ చెప్పుకొచ్చాడు.
కోల్‌కతాలో ఓ ఫ్యాషన్ స్టోర్‌ని రూపాలి రన్ చేస్తోంది. వీరి పెళ్లి విషయం తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.1986 లో తన సినిమా కెరీర్‌ను ప్రారంభించిన ఆశిష్.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ, బెంగాలీ ఇలా దాదాపు 11 భాషల్లో 300 చిత్రాల్లో నటించారు.
‘పాపే నా ప్రాణం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్నారు. ‘పోకిరి’, ‘గుడుంబా శంకర్’ చిత్రాలు ఈయనకు మంచి పేరును తీసుకువచ్చాయి.