బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. ఆమెకు చెందిన రూ.7.27కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును ఈడీ అటాచ్ చేసింది. ఈ మొత్తాన్ని ఆమెకు వ్యాపారవేత్త సుకేశ్ చంద్రశేఖర్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయమై జాక్వెలిన్ ను ఈడీ ఇప్పటికే మూడు సార్లు ప్రశ్నించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్, ఆయన భార్య, నటి లీనా మరియా పాల్ తో పాటు మరో ఆరుగురి పేర్లను ఈడీ తన చార్జ్ షీట్ లో చేర్చింది.
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని వ్యాపారవేత్త నమ్మబలికారు. ఈ మేరకు వారి భార్యల దగ్గర నుంచి రూ. 200 కోట్ల వరకు వసూలు చేశారు.
ఆ తరర్వాత దీనిపై ఢిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ)కు శివిందర్ సింగ్ భార్య ఫిర్యాదు చేశారు. దీంతో సుకేశ్ పై కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్టు చేసింది.
తిహార్ జైలులో ఉన్న సమయంలోనే కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సుకేశ్ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. సమాజంలో పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటూ ఫెర్నాండెజ్ తో సుఖేశ్ పరిచయం పెంచుకున్నాడు.
ఆ తర్వాత ఆమెకు బంగారు, వజ్రాల నగలు బహుమతిగా ఇచ్చారని ఈడీ వర్గాలు చెప్పాయి. దీంతో పాటు రూ. 52 లక్షలు విలువ చేసే ఓ గుర్రాన్ని, 9 లక్షలు విలువ చేసే పర్షియన్ క్యాట్స్ ను బహుమతిగా ఇచ్చినట్టు పేర్కొన్నాయి. దాదాపు ఆమెపై రూ. 10 కోట్ల వరకు ఖర్చుచేసినట్టు తెలిపాయి.