తనని 139 మంది 5000 సార్లకు పైగా అత్యాచారం జరిపారు అంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనని గత తొమ్మిది సంవత్సరాలుగా 139 మంది అత్యాచారం చేశారంటూ యువతి చేసిన ఫిర్యాదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరోవైపు యువతి ఫిర్యాదు మేరకు 113 పేజీల ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యాంకర్ ప్రదీప్ కూడా ఇదే విషయమై స్పందించారు. తనకు సంబంధం లేని విషయంలో తన పేరును పెట్టి ట్రోల్స్ చేస్తున్నారని దీనివల్ల తన కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతుందని ప్రదీప్ ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటానని ప్రదీప్ హెచ్చరించారు.
ఇదే విషయమై సినీ నటుడు కృష్ణుడు కూడా స్పందించాడు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసు నేను ఫాల్స్ కేసుగా భావిస్తున్నానని తెలిపారు. ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఇవన్నీ ఉన్నప్పుడు చదువుకున్న యువతి తనకు అన్యాయం జరుగుతుంటే పోలీసులకు ఫిర్యాదు చేయలేదా అని ప్రశ్నించారు. డయల్ 100 కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందించి ఉండేవాళ్ళు. కేసులో సెలబ్రిటీలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా కేసు తీవ్రత పెరుగుతుంది అంటే చాలా తప్పు. ఇలాంటి ఆరోపణలతో మేము మా కుటుంబ సభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నాము. నాలుగైదు నెలల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి నాకు ఫోన్ చేసింది నేను మీ అభిమానిని నల్గొండకు రావాలని అడిగింది. అయితే నాకు అనుమానం వచ్చి కాల్ కట్ చేసి నెంబర్ బ్లాక్ లో పెట్టాను. ఈ కేసులో పోలీసుల నుంచి ఇలాంటి నోటీసుల కానీ ఫోన్ కానీ నాకు రాలేదు నేను ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.