సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ నటుడు మోహన్ జునేజా(54) కన్నుమూశారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు మోహన్ జునేజా. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా.. సిరీయల్ యాక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ‘విరాట’ అనే సీరియల్ సహా పలు సీరియల్స్‌లో కీలక పాత్రలను పోషించిన ఆయన.. చాలా తక్కువ కాలంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. చెల్లాట సినిమా ఆయన కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.
అలాగే, మోహన్ జునేజా కేజీఎఫ్, కేజీఎఫ్-2 రెండు సినిమాలలో కీలక పాత్రలో నటించారు. అందులో రాకీ భాయ్‌తో ట్రావెల్ చేసిన ఓ జర్నలిస్ట్ ఆయన బాల్యం గురించి పుస్తకం రాయలనుకుంటాడు. ఆ క్రమంలో ఓ వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి రాకీ భాయ్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెబుతాడు. అలాంటి వ్యక్తి పాత్రలో మోహన్ జునేజా కనిపించారు. కనిపించేది కొద్దిసేపే అయినా, హీరో పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశాల్లో తళుక్కున మెరిసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమ మోహన్ జునేలా మృతి విషయం తెలిసి దిగ్బ్రాంతికి లోనయ్యింది. మోహన్ జునేజాకి పలువురు కన్నడ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. మోహన్‌కు తల్లి, భార్య కుసుమ, అక్షయ, అశ్వినీ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.