ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ పట్ల యూపీ పోలీసులు తీరును నటుడు, రాజకీయనాయకుడు శత్రఘ్ణ సిన్హా ప్రశ్నించారు. డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పద్ధతి ఇది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సందేశం పంపారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన బిడ్డ పట్లనే పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ట్వీట్ చేశారు. మొదట మీరు గాంధీ కుటుంబానికి వీఐపీ సెక్యూర్టీని తగ్గించారు…తర్వాత ఎస్పీజీ ప్రొటెక్షన్ తొలగించారు…ఆ తర్వాత మీ సూచనల కనుగుణంగా యూపీ పోలీసులు ప్రియాంకా గాంధీ పట్ల అవమానకరమైన రీతిలో ప్రవర్తించారని ట్విట్టర్ లో తెలిపారు.
పౌరసత్వ చట్ట వ్యతిరేక ర్యాలీలో పాల్గొని అరెస్టయిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ను దారాపురిని శనివారం పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డగించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఇది జరుగుతుండగానే ఓ కార్యకర్త స్కూటరెక్కి వెళ్తున్న ప్రియాంక గాంధీని పోలీసులు చుట్టుముట్టారు. ఓ మహిళా పోలీసు ఆమె గొంతు పట్టుకున్నారు. మరో పోలీసు నెట్టి వేయడంతో పడిపోయారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..పోలీసులు అణిచివేతకు గురైన ప్రతి పౌరుడి తరపును తాను నిలబడతానన్నారు. ఇదే తన సత్యాగ్రహమని చెప్పారు.
ప్రియాంక గాంధీ గొంతు పట్టుకున్న అర్చనా సింగ్ అనే మహిళా పోలీసును ఉన్నతాధికారులు వెనకేసుకొచ్చారు. అర్చనా సింగ్ ఆమె విధులను సమర్ధవంతంగా నిర్వహించారని లక్నో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కళానిధి నైతాని అన్నారు.