రాజకీయ వేత్త, సినీ నటి ఉర్మిళ మటోండ్కర్ ఈ రోజు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వెంటే ఆమె పాదయాత్ర చేశారు. ఇటీవల జమ్ములో భారత్ జోడో యాత్ర జరిగే ప్రాంతానికి సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ నేపథ్యంలో యాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆర్మీ గార్రిసన్ దగ్గర నుంచి మార్చ్ ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన కొద్ది సేపటికే ఉర్మిళ మటోండ్కర్ వచ్చారు. రాహుల్ యాత్రకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. 2019లో ఊర్మిళ కాంగ్రెస్ లో చేరారు.
ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడి శివసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆమె క్రీమ్ కలర్ కశ్మీరి సంప్రదాయ గౌన్, బివీ క్యాప్ ధరించారు. ఉర్మిళతో పాటు ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్, జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ, మాజీ మంత్రి అబ్దుల్ హమీద్ లు కూడా రాహుల్ వెంట నడిచారు.
వారంతా త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని రాహుల్ వెంట నడిచారు. భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర గురువారం పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించింది. యాత్ర గార్రిసన్ నగరానికి మంగళవారం చేరుకుంది.