సీనియర్ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ కన్నుమూశారు. చెన్నైలోని తన ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ప్రతాప్ పోతన్ వయసు 71 సంవత్సరాలు.ఆయన బహుభాషా నటుడు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు
ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన మమ్ముటీ నటించిన CBI5 ది బ్రెయిన్‌లో చివరిగా కనిపించారు ప్రతాప్. థకార, చమరం, 22 ఫిమేల్ కొట్టాయం వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక చివరగా ప్రతాప్ పోతేన్ మోహన్‌లాల్ బరోజ్: నిధి కాక్కుం భూతంలో నటించారు. ప్రతాప్ పోతన్ చివరగా దర్శకత్వం వహించిన సినిమా మోహన్‌లాల్, శివాజీ గణేశన్‌లు నటించిన 1997 చిత్రం ఒరు యాత్రమొళి.
ప్రతాప్ పోతన్ మలయాళ చిత్రసీమలో పనిచేస్తూ.. తమిళం, తెలుగు చిత్రాలలో కూడా నటించారు. అతను 1985లో వచ్చిన మీండుమ్ ఒరు కాతల్ కథై చిత్రానికి దర్శకత్వం వహించినందుకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ప్రతాప్ పోతన్ నటించిన థకారానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, 1980లో చమరం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, 1985లో మీండుమ్ ఒరు కాతల్ కథై చిత్రానికి ఇందిరాగాంధీ ఉత్తమ దర్శకుడిగా , 1987లో రితుభేదం చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
ప్రతాప్ 1985లో నటి రాధికను వివాహం చేసుకున్నారు. అయితే, వారి వివాహం ఎక్కువ కాలం సాగలేదు. ఈ జంట 1986లో విడిపోయారు. ఆ తర్వాత అతను 1990లో సీనియర్ కార్పొరేట్ ప్రొఫెషనల్‌గా ఉన్న అమలా సత్యనాథ్‌ను మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కీయా 1991లో జన్మించింది. వీరు కూడా 22 సంవత్సరాల తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు. ప్రతాప్ పోతన్ మరణం పట్ల ప్రముఖలు, సినీ పెద్దలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.