సినీ నటుడు సోనూసూద్ ను పంజాబ్ పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్ లోని మోగా జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల సందర్శనకు ఆయన ఆదివారం వెళ్లారు. ఓటర్లను సోనూ ప్రభావితం చేస్తున్నారంటూ శిరోమణి అకాళీదళ్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.
దీంతో సోనూసూద్ ను అడ్డుకుని అతని కారును అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఆయన్ని ఇంటికి పంపించి వేశారు. ఎన్నికలు ముగిసే వరకు సోనూ బయటకు రాకూడదని, ఆదేశాలను ఉల్లంఘించి బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
మోగా నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సోనూ సూద్ సోదరి బరిలో నిలిచారు. మోగాలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు డబ్బులు పంచుతున్నట్టు తమకు సమాచారం రావడంతోనే పోలింగ్ కేంద్రాల సందర్శనకు వెళ్లినట్టు సోనూసూద్ తెలిపారు.
‘ మోగాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతిపక్షాలు డబ్బులు పంచుతున్నట్టు మాకు సమాచారం అందింది. ప్రత్యేకంగా అకాళీదళ్ సభ్యులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో అక్కడకు వెళ్లి పరిశీలించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటం మా విధి” అని అన్నారు.