నటుడు సోనూసూద్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన నివాస సముదాయ ప్రాంగణమైన ఇంటిని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారని బృహత్ ముంబై కార్పోరేషన్ ఇచ్చిన నోటీసులపై ఆయన అప్పీల్ కు వెళ్లారు. తన రెగ్యూలేషన్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.
ముంబై కార్పోరేషన్ నోటీసులపై సోనూసూద్ ముందుగా బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. బాంబే హైకోర్టు కూడా కార్పోరేషన్ నోటీసులకు అనుకూలంగా తీర్పునివ్వటంతో సుప్రీంను ఆశ్రయించగా, ఊరట లభించింది.
సుప్రీం తీర్పుపై బీజేపీ స్పందించింది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించింది. కంగనా రనౌత్ విషయంలోనూ కార్పోరేషన్ ఇలాగే చేసి చేతులు కాల్చుకుంది, ఇప్పుడు సోనూసూద్ విషయంలోనూ అత్యుత్సాహాం ప్రదర్శించిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన ప్రభుత్వంలోని లోటుపాట్లను సోనూసూద్ ఎత్తిచూపారు. ముఖ్యంగా కరోనా సమయంలో వలసకూలీలను తమ స్వస్థలాలకు చేరవేయటం, వారికి ఆహారం అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినా… సోనూసూద్ అండగా నిలబడ్డారని, ఇప్పుడు తనపై కక్ష సాధిస్తున్నారంటూ మండిపడింది.
సుప్రీంతీర్పుపై సోనూసూద్ స్పందించారు. ఈ నిర్ణయంతో కాస్త ఊపిరిపీల్చుకునే వెసులుబాటు కలిగిందని, తన పొరపాట్లను సరిదిద్దుకుంటానన్నారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. తన వ్యాపారాలన్నీ చట్టబద్ధంగా సాగాలన్నదే తన అభిమతమని, కానీ దురదృష్టవశాత్తు కానీ కొందరు వ్యక్తుల కారణంగా నిర్మాణ ఆకృతుల్లో లోపాలు వచ్చినట్లు తెలిపారు.