ప్రపంచ మాజీ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు రెవిన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. సిన్నార్ రెవిన్యూ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. సిన్నార్‌లోని ఓ భూమికి సంబంధించి ఆమె పన్ను చెల్లించలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో అధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. నోటీసులో తెలుస్తున్న వివరాల ప్రకారం… ఆమె ఏడాది నుంచి ఆమె భూమికి సంబంధించి రూ. 22వేల పన్నును ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. దీంతో పన్ను చెల్లించాల్సిందిగా ఆమెకు నోటీసులు పంపినట్టు రెవిన్యూ వర్గాలు చెప్పాయి.
ఆమెతో పాటు మొత్తం 1200 మందికి పన్ను నోటీసులు పంపినట్టు పేర్కొన్నాయి. నోటీసులు అందుకున్న వారిలో ఎల్బీ కుంజీర్ ఇంజనీర్, గుమ్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీసీ మరాఠా లిమిటెడ్, హోటలే లీలా వెంచర్ లిమిటెడ్, ఎస్కే శివరాజ్, కుక్రేజా డెవలపర్ కార్పొరేషన్ తో పాటు పలు కంపెనీలు ఉన్నాయి.
వీరంతా పన్నులు చెల్లించక పోవడంతో ప్రభుత్వానికి గండి పడుతోంది. ప్రభుత్వానికి మొత్తం రూ.1.11 కోట్లు నష్టం వాటిల్లుతోందని అధికారులు తెలిపారు. అందువల్ల మార్చిలోగా పన్ను చెల్లించాల్సిందిగా వారందరికి ఈ నోటీసులలో ఆదేశించారు.