నటి చౌరాసియా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుంటే ఓ యువకుడు వెంట పడ్డాడని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..సీసీ కెమెరాలు పరిశీలించారు. నటి చౌరాసియా వెంట ఎవరూ పడలేదని తేల్చారు.
ఇక ఈ వ్యవహారంలో.. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ చేయడం గమనార్హం. అయితే నవంబర్ 17,2021 లోఇదే తరహాలో దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు చౌరాసియా. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఇక తాజా ఘటన పై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటి చౌరాసియా జాగింగ్ చేసుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి ఒక వ్యక్తి ఫాలో చేశాడని ఫిర్యాదు చేయడం జరిగింది.
పోలీసులు విచారించి చూడగా అతను కూడా జాగింగ్ చేస్తున్నాడని తెలిసింది. దీంతో అతడి పూర్తి వివరాలు తీసుకొని వదిలేశారు. ఇక గతంలోనూ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు బయట వాకింగ్ కు వచ్చిన సినీ నటి షాలూ చౌరాసియా పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడి కేసులో పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి. నటిపై దాడికి తెగబడింది సైకో అని భావించారు. దుండగుడు నటిపై దాడి చేసి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడు సినిమాల్లో లైట్ మేన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఈ ఘటన జరగగా.. ఇప్పుడు మరోసారి నటి చౌరాసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.