మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన కొత్తల్లోనే భారీ విజయాలను అందుకున్నాడు. క్రమక్రమంగా మార్కెట్ ను, ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు కూడా. మరీ ముఖ్యంగా కొంత కాలంగా కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. అయితే, అతడు నటించిన ‘గని’ ఆశించిన రీతిలో ఆడలేదు. అయినప్పటికీ అతడు ఫుల్ జోష్‌తోనే ముందుకెళ్తోన్నాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో ఓ క్రేజీ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తి అయింది. ఇప్పుడు లండన్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే, తన 13వ సినిమాను కూడా వరుణ్ ఇప్పటికే లైన్‌లో పెట్టుకోవడంతో పాటు అనౌన్స్ చేసేశాడు.
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రాబోతున్న ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా రూపొందిస్తున్నాడు. ఎయిర్‌ఫోర్స్ వార్ బ్యాగ్‌డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. అంతేకాదు, భారత వైమానిక దళానికి చెందిన అభినందన్ వర్థమాన్ కథతో ఇది రాబోతుందని తెలిసింది. ప్రతిష్టాత్మకంగా రాబోతున్న వరుణ్ తేజ్‌కు జోడీగా నటించే హీరోయిన్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న మూవీ కావడంతో హిందీ నటినే తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది.
అందుకు అనుగుణంగానే ఈ మూవీ కోసం 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ను తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ ఆమెకు వెల్‌కం చెబుతూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అంతేకాదు, ముంబైలో జరిగే మొదటి షెడ్యూల్‌లో ఈ జంటపై కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటను చిత్రీకరిస్తారని తెలిసింది.
వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ముంబైలో షూట్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిసింది.