సినీనటి మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి మృతి చెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్.. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం కరోనా బారిన పడింది. మెల్లగా కోలుకున్న ఆమె భర్త విద్యాసాగర్, అప్పటి నుండి మధ్యలో కొంత అస్వస్థతకు గురవుతున్నారని తెలిసింది.
కొన్నేళ్లుగా ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్.. ఊపిరి తీసుకోవడానికి బాధపడుతుండేవారు. దీంతో ఆయన్ను చెన్నై ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందారు విద్యాసాగర్. మీనా భర్త హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.
విద్యాసాగర్ మరణవార్త తెలిసిన పలువురు చిత్ర రంగ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. మీనా, ఆమె కుటుంబసభ్యులకు మా కుటుంబం సంతాపం వ్యక్తం చేస్తోంది’ అని సీనియర్ నటుడు శరత్ కుమార్ ట్వీట్ చేశారు. బుధవారం విద్యాసాగర్ అంత్యక్రియలు జరగనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
Advertisements
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విద్యాసాగర్ ను మీనా 2009లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. ఇటీవల మీనా.. దృశ్యం 2 సహా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.