సెలబ్రిటీ న్యూ కపుల్ నయనతార, విగ్నేశ్ శివన్ సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని నయన్, విఘ్నేష్ స్వయంగా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పోస్ట్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు విగ్నేశ్. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నయనతార సరోగసి అంశంపై ప్రస్తుతం వివాదం నెలకొంది.
ఈ అంశంపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యం స్పందించారు. నయనతార సరోగసి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల క్రితం పెళ్లయిన జంట సరోగసీ ద్వారా గర్భం దాల్చగలరా? కాల పరిమితి ఉందా? అని మీడియా సమావేశంలో మంత్రి సుబ్రహ్మణ్యంను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.
దీనిపై మంత్రి ఎం సుబ్రహ్మణ్యం స్పందిస్తూ.. నయనతార సరోగసి అంశంపై ఆరోగ్య శాఖ వివరణ కోరుతుందని, సరోగసీ చట్ట బద్దంగా జరిగిందా? అనే దానిపై క్లారిటీ ఇవ్వాలన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ విచారణకు ఆదేశిస్తామన్నారు.
కాగా చాలా కాలంగా ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేష్ శివన్ 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. వెడ్డింగ్ పూర్తయ్యాక కొన్ని రోజుల్లోనే ఈ ఇద్దరూ తమ తమ సినిమాల షెడ్యూల్‌తో బిజీగా అయిపోయారు. నెల రోజులకు పైగానే వీరిద్దరూ దుబాయ్ వెళ్లి హనీమూన్ చేసుకున్నారు.