‘ది కశ్మీర్ ఫైల్స్’ నటి, జాతీయ అవార్డు గ్రహీత కూడా అయిన పల్లవి జోషీ గాయపడ్డారు. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీస్తున్న ‘వ్యాక్సిన్ వార్’ సినిమా షూటింగ్ లో కారు ఛేజింగ్ సీన్ షూట్ చేస్తుండగా ఆమె గాయపడ్డారు. హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఓ సీన్ ని చిత్రీకరిస్తున్నప్పుడు కారు అదుపు తప్పి పల్లవి జోషీని ఢీ కొన్నట్టు తెలుస్తోంది.
అయితే గాయపడినప్పటికీ ఆమె తన సీన్ షాట్ ముగించుకున్న తరువాత చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. ఆమె పరిస్థితి బాగానే ఉందని ఈ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దేశంలో కరోనా సమయంలో జరిగిన యదార్థ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమా తీస్తున్నారు. 1997 లో అగ్నిహోత్రి, పల్లవి జోషీ దంపతులయ్యారు. బహుశా ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి ‘వ్యాక్సిన్ వార్’ చిత్రం విడుదల కావచ్చునని తెలుస్తోంది.
పలు మరాఠీ, హిందీ సినిమాల్లో పల్లవి జోషీ నటించారు. ఇన్సాఫ్ కీ ఆవాజ్, అంధా యుధ్, దాత, సౌదాగర్ ‘ తలాష్, ఇన్సానియత్, ఇంతేహాన్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.