రాహుల్ గాంధీ గురించి యాక్టర్ రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ హీరో సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ లోని ‘నిదరే కల అయినదీ, కలయే నిజమైనది’ పాటలో కనిపించిన హీరోయిన్ రమ్య. తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. అలాగే అమితాబ్ బచ్చన్‌తో కలిసి అమృత వర్షం అనే మల్టీ లాంగ్వేజ్ సినిమాలో హీరోయిన్ గా కనిపించి మెప్పించింది రమ్య.
అయితే ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. 2012లో కాంగ్రెస్ లో చేరిన రమ్య.. కర్ణాటకలోని మాండ్య నియోజక వర్గం నుండి లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందింది. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి కూడా రాజీనామా చేసింది.
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ‘ఉత్తరకాండ’తో రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రమ్య. ‘అమ్మానాన్నలే నాకు ప్రాణం.. నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. అయితే అప్పటికీ పార్లమెంటు కార్యకలాపాల గురించి నాకేమీ తెలియదు. అంతా కొత్తగా ఉంది. అయినా ప్రతీదీ నేర్చుకున్నా. నేను నా బాధను పని వైపు మళ్లించాను’.
‘అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. లైఫ్ లో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీనే ఉంటారు. ఓ వైపు నాన్న మరణం.. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోవడంతో బాగా నిరాశ చెందాను. సూసైడ్ చేసుకోవాలనిపించింది. అలాంటి కష్ట సమయంలో రాహుల్ నాకు అండగా నిలబడ్డారు. మానసికంగా ధైర్యమిచ్చారు’ అని చెప్పుకొచ్చింది రమ్య.