సాయిపల్లవి మన పక్కింటి అమ్మాయి. మెరుగులు దిద్దని సహజమైన అందం ఆమెది, ఏ ప్రాంతమయినా, ఏ పాత్రైనా అతికినట్టు సరిపోతుంది. వరుస ఆఫర్లు వస్తున్నా..ఇప్పటి వరకూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఎంచుకున్న పాత్రకు జీవం పోసింది.ఈ క్రమంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
తాను డాన్సు చేసిందంటే నెమలి ఆడినట్టుగానే ఉంటుంది. అందుకే కుర్రకారంతా ఆమెకు ‘ఫిదా’ అయ్యారు. తెలుగుతోపాటు.. పలు దక్షిణాది భాషల్లో నటించి మెప్పించింది. తెలుగులో చివరిసారిగా విరాటపర్వం సినిమాతో సందడి చేసింది. ఆ తర్వాత హీరో సూర్య నిర్మించిన గార్గి మూవీతో అలరించింది.
ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి అరెస్టింగ్ పెర్ఫార్మెన్స్ చేసి జౌరా అనిపించింది. అయితే గత కొద్ది రోజులుగా సాయి పల్లవి సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. తాజాగా ఓ అందమైన ఫోటో షేర్ చేస్తూ నెట్టింట మళ్ళీ అడుగుపెట్టింది ఈ నేచురల్ బ్యూటీ.
తన ఇంట్లో సోఫాలో కూర్చుని మనస్పూర్తిగా నవ్వులు చిందిస్తూన్న ఫోటో షేర్ చేస్తూ… జీవితంలో చిరునవ్వులు..ఆశ..కృతజ్ఞత ఉంటే చాలంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఇక చాలా కాలం తర్వాత సాయి పల్లవి అందమైన పిక్ షేర్ చేయడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. సాయి పల్లవి పిక్ కు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే కొద్ది రోజులుగా సాయి పల్లవికి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆమె సినిమాలు మానేసిందని.. తన చెల్లితో కలిసి హాస్పిటల్ నిర్మించి.. చదువులు పూర్తిచేయాలని భావిస్తోందని.. అలాగే నటనకు దూరంగా ఉండి..డాక్టర్ కావాలనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ రూమర్స్ పై ఇప్పటివరకు సాయి పల్లవి స్పందించలేదు.