''గొడవ నాదీ, కత్తి మహేష్‌దీ.. టీవీ9 ప్రమేయం లేనేలేదు''

టాలీవుడ్‌లో ‘క్యాస్టింగ్ కౌచ్’ లొల్లి పూటకో కొత్త మలుపు తిరుగుతోంది. శ్రీరెడ్డికి మద్దతుగా కొందరు, విరుద్ధంగా మరికొందరు మీడియాకెక్కి తమతమ అభిప్రాయాల్ని, అనుభవాల్ని పంచుకుంటూ.. ఎపిసోడ్‌ని మరింత ఆసక్తికరంగా మార్చేశారు. ఈ కోవలోనిదే.. సునీత బోయ అనే ఫిమేల్ జూనియర్ ఆర్టిస్ట్ బాగోతం. టీవీ9 డిబేట్లో కూర్చుని కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ యథాలాపంగా క్రిటిక్ కత్తి మహేష్‌తో తనకున్న పాత పరిచయాన్ని ప్రస్తావించిందామె. ”కత్తి మహేష్ బైటికి కనిపించేంత మంచోడు కాదు.. అతడు నామీద బలాత్కారం చేయబోయాడు.. నా దగ్గర ఆధారాలు కూడా వున్నాయి” అని చెప్పి కొత్త సంచలనానికి తెరతీసింది.

తనమీద ‘అటెంప్ట్ టు రేప్’ కేసు పెడతానన్న సునీత బోయ.. ఆ తర్వాత వెనక్కు తగ్గేసరికి.. కత్తి మహేష్ ‘ఛాన్స్’ తీసుకున్నాడు. తనమీద మోపిన అభియోగాల్ని నిరూపించకపోతే.. 50 లక్షలకు పరువునష్టం దావా వేస్తానంటూ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించాడు.

దీంతో బెంబేలెత్తిపోయిన సునీత.. తనకేమీ తెలీదని.. 50 లక్షలు కట్టమంటే తానెక్కడికి పోవాలని రోదిస్తూ ఒక వీడియో మెసేజ్ పాస్ చేసింది. టీవీ9 వారు పిలిస్తేనే డిబేట్‌కి వెళ్లానని, నాకు తెలిసిందే చెప్పానని కూడా ఆ వీడియోలో సునీత స్టేట్మెంట్ ఇచ్చింది. కత్తి మహేష్-టీవీ9 కలిసి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న మాటను కూడా అక్కడే దొర్లించింది. దీంతో ఇష్యు కొత్త మలుపు తిరిగింది.

అయితే.. కొన్ని గంటలు గడిచేలోగా ఆ అమ్మాయి మరో యూటర్న్ తీసుకుంది. పరువునష్టం, కోర్టు కేసు అనేసరికి గందరరగోళంలో పడి.. ఏం మాట్లాడాలో తెలీక టీవీ9 ప్రస్తావన తెచ్చానంటూ కొత్త వెర్షన్ బైటపెట్టింది సునీత. తనకు-కత్తి మహేష్‌కి మధ్య జరిగే గొడవతో టీవీ9కి ఎటువంటి ప్రమేయం లేదని స్పష్టంగా చెబుతూ మరో వీడియో బయటపెట్టింది. కత్తి మహేష్ దుర్మార్గాన్ని ఖచ్చితంగా బైటపెడతానంటూనే.. ఇందులో టీవీ9 ప్రమేయం ఉందన్న తన వాదనను పూర్తిగా వెనక్కు తీసుకుంది సునీత బోయ.

Posted by Sunitha Artist on Sunday, April 15, 2018