సోషల్ మీడియాలో తనపై చేసే ట్రోల్స్ కు ధైర్యంగా సమాధానాలిస్తూ తరచుగా ట్రెండింగ్ లో ఉండే బాలీవుడ్ నటి తాప్సీ పన్ను శనివారం కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ లిస్ట్ లో టాప్ లో ఉన్నారు. దీనికి కారణం ఢిల్లీలో ఓటు వేసినందుకు తనను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేసే వారికి ఆమె ఇచ్చిన గట్టి సమాధానాలే.
శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాప్సీ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసింది. అనంతరం ఓటు వేసినట్టుగా వేలిముద్రలను చూపిస్తూ తన తల్లిదండ్రులు నిర్మలాజీత్, దిల్ మోహన్ సింగ్, సోదరి షాగున్ లతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆమె ఫోటో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఒకరు స్పందిస్తూ ముంబై లో ఉంటూ ఢిల్లీలో ఓటు వేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? అని ప్రశ్నించారు. అంతే గాక ఆమె ఓటును ఢిల్లీ నుంచి ముంబైకి మార్చుకోవాలని సలహా ఇచ్చారు. దీనికి వెంటనే స్పందించిన తాప్సీ”ఢిల్లీ వాసిని” అని పెట్టారు. ఆ తర్వాత వరుసగా ట్వీట్లు చేశారు. ”నా గురించి కాకుండా సిటిజన్ షిప్ గురించి పట్టించుకోమన్నారు…నేను ముంబై కంటే ఎక్కువగా ఢిల్లీలోనే నివసించాను…నా ఇన్ కం ట్యాక్స్ ఢిల్లీ నుంచే చెల్లిస్తున్నాను. చాలా మంది ఢిల్లీలో నివసిస్తుంటారే తప్ప ఢిల్లీకి ఏం చేయరు…నేను వాళ్ల కంటే ఎక్కువే…దయచేసి నా సిటిజన్ షిప్ గురించి అడగకు…నీ గురించి ఆలోచించు…సిటిజన్ షిప్ కోసం నీవు ఏం చేస్తున్నావో ఆలోచించు” అని ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
తాప్సీ ఏం చేయాలో…ఏం చేయకూడదో సూచిస్తూ మరో నెటిజన్ పెట్టిన కామెంట్స్ కు కూడా సమాధానం ఇచ్చారు. ”ఒక అమ్మాయిని మీరు ఢిల్లీ నుంచి దూరం చేయగలరు కానీ ఢిల్లీని ఆ అమ్మాయి నుంచి దూరం చేయలేరు…నేనేం చేయాలో…ఏం చేయకూడదో మీరు చెప్పాల్సిన అవసరం లేదు…ఢిల్లీ అంటే నాకెంత ప్రేమనో భవిష్య ఈ సమాధానంతో అర్ధమైందనుకుంటా” అన్నారు.