అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్
జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలలో కమలనాథులకు వెగటు ఫలితాలు. ఇంతలో ఢిల్లీ పీఠంపై అధిష్టించిన ఆప్. ఇవన్నీ చూసిన బీజేపీకి అర్థమైన విషయం ఏమిటంటే..? బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి తను కొత్త సమీకరణాల్లో ఇష్టంలేకున్నా… కాషాయధారులు ‘కషాయం’మింగుతూ బలవంతంగా ముందుకు వెళ్లాలి అని..! జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల బలమైన కూటమి.. అదేనండీ ‘టెంట్ లేని ఫంట్’లు ఏర్పడకుండా… ముందుగానే కొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవాలి అని..! రాబోయే నాలుగేళ్లలో తన పాలన సజావుగా సాగటానికి, బిల్లులు పాస్ కావటానికి, కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకోకుండా మరింతగా కత్తెర్లు వేయటానికి ఇదే మార్గం అని..! దక్షిణాదిన కమలనాథులు పక్కా పథకంతో నర్మగర్భంగా ముందుకు సాగుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎర వేస్తూ… ప్రాంతీయ పార్టీలను భాగస్వామ్యులుగా పావులు కదుపుతున్నారు. ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రత్యేక కథనం.
ఇదో తిరకాసుంది..:
ఇక్కడా మళ్లీ కొంత జాగ్రత్త… తాము రెండో స్థానంలోకి వెళ్లగలమని నమ్మకం ఉన్నచోట్ల అక్కడి ప్రాంతీయ పార్టీలతో ‘ఫైట్’ చేస్తూనే ఉండాలి. ఉదాహరణకు, తెలంగాణలో కేసీయార్, (కూతురు కవితమ్మకు పదవిస్తామనే గుసగుసలు ఉన్నాయ్.) ఒడిశాలో నవీన్ పట్నాయక్… సో, ఈ దిశలో బీజేపీ వైసీపీని ఆహ్వానిస్తున్నది. నిజంగా ఏం జరుగుతుంది..? మోడీ కేబినెట్‌లో సాయిరెడ్డి చేరతాడా..? లేదా..? మరి మొన్న మొన్ననే కదా బీజేపీ పవన్ కల్యాణ్ తో చేతులు కలిపింది. (ప్చ్.. పాపం పవనాలు ఎటో..!) తనను ఏం చేయబోతున్నారు..? వంటి ప్రశ్నలు ఇక్కడే కాసేపు వదిలేద్దాం.
తమిళనాడు.. మరో టర్నింగ్ టాపిక్:
డీఎంకేను కూడా మోడీ టీం తమ శిబిరంలోకి ఆహ్వానిస్తున్నది. కణిమొళిని కేబినెట్‌లోకి తీసుకుంటామని చెబుతున్నది. ఎందుకు..? ఇన్నాళ్లూ అన్నాడీఎంకే వెంట ఉన్నది బీజేపీ. కానీ ఇక్కడ బీజేపీ కొత్త ప్లాన్ ఏమిటంటే..? ఇప్పట్లో తమిళనాడులో తమకు పెద్దగా ఒరిగేదీ లేదు. ఒరుగుతుంది అనే ఆశ లేదు. అందుకే వీలైనంతగా ద్రవిడ రాజకీయాల్ని కసా, బిసా..డిస్ట్రబ్ చేయడం. ఆల్ రెడీ అన్నాడీఎంకే అయోమయావస్థలో ఉంది… ఇప్పటికిప్పుడు శశికళను విడుదల చేసినా, పాత పార్టీ మొత్తం ఆమె వెంటనే ఉండే సీన్ కూడా లేదు. శశికళ ఆంటీ ఇప్పుడే జైలు గోడలు దాటి బయటకు వచ్చే అవకాశం లేదు. వస్తే గిస్తే.. మహా అయితే ఇంట్లో త్వరలో జరగబోయే శుభకార్యానికి జస్ట్ వారం రోజుల పేరోల్. అంత తక్కువ సమయంలో ‘ఆమె’ ఆ నగలు వేసుకోవడానికే సరిపోదు. మరీ పెళ్ళి పెద్దగా మరి. మరోవైపు డీఎంకే బాగా బలోపేతంగా కనిపిస్తున్నది. అది కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో జతకట్టి ఉంది… సో, డీఎంకేను తమ వెంట ఉంచుకుంటే కాంగ్రెస్‌కు, లెఫ్ట్‌ను కత్తెర వేయడమే గాకుండా… డీఎంకే రాజ్యసభ బలం కూడా మోడీకి ఉపయోగకరం. భలే ఐడియా..! మోడీ’షా’ తెగ ముద్దొచ్చేస్తున్నారు. ప్రత్యేకించి జాతీయ స్థాయిలో యాంటీ-మోడీ కూటమి ఏర్పాటు ప్రయత్నాల నుంచి బలమైన డీఎంకేను వేరు చేయడం తక్షణ కర్తవ్యం. అన్నిరకాలుగా బీజేపీకి ప్రయోజనం.!
మరి డీఎంకేకు ఏం లాభం..?:
మన జగన్ కు ఉన్నట్లే…కణిమొళి సహా డీఎంకే ముఖ్యులపై ఆ పాత టూజీ సీబీఐ కేసులు అలాగే ఉన్నయ్. టైం చూసి, బీజేపీ మళ్లీ తొక్కకుండా కాపాడుకోవడం…! నిజానికి డీఎంకే, బీజేపీ దోస్తీ ఎలాంటిదంటే పీడీపీ, బీజేపీ దోస్తీ వంటిది. (సిగ్గు లేకపోతే సరి..!) పరస్పరం పూర్తి భిన్నంగా ఉండే పార్టీలు కలిసి నడవడం. కానీ బీజేపీ ఆ పని చేయగలదు. మన కేసీఆర్ అటు మజ్లీస్.. ఇటు స్వామీజీలతో ముందుకు సాగినట్లు. మొన్నమొన్నటి దాకా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో టెర్రర్ పోకడలున్న పార్టీలతో దోస్తీ చేసింది. అయినా రాజకీయాల్లో అస్పృశ్యత ఏముంటుంది..? మనోళ్ళకు లేంది గదొక్కటే కదా..! దరిద్రం ఇంతకంటే ఏం అనలేం. అధికారం కోసం ఏమైనా చేయడమే కదా రాజకీయం అంటే. అవును… నిజమే… గతంలోనూ బీజేపీ, ‘డీఎంకే దోస్తీ అనేది ఉంది… ఇప్పుడు ఉండబోదు’ అని సూత్రీకరించలేం…! లేని బల్లాపై గుద్ది చెప్పలేం. జగన్, స్టాలిన్‌ను తమ శిబిరంలోకి తీసుకోవడం అంటే మొదట షాక్ తినేది కేసీయార్. బట్ జీర్ణించుకోవాలి. సర్థుకుపోవాలి. తనకు జగన్, జగన్ ద్వారా స్టాలిన్… ఆ బంధాలు కత్తిరించబడతాయి. అప్పుడప్పుడూ కేవలం మాటల్లో మాత్రమే ఉరిమే ఫెడరల్ ఫ్రంటుకు ఆదిలోనే గండి కొట్టినట్టవుతుంది. నిజంగా ‘బీజేపీ ఇంత సీరియస్‌గా ఆలోచిస్తున్నదా..’ అంటారా..? అంత తేలికగా కొట్టేయలేం..!! ఎందుకంటే ‘స్వేచ్ఛ భారత్’ పేరుతో మహాత్మాగాంధీని కాంగ్రెస్ ‘ఖంగు’ తినేలా వాడేసింది.. కదా..!
box:
కేసీయార్ కు కమలం గిలిగింతల కౌగిలింతలు
‘అమరావతి రాజధాని తరలింపు అన్యాయం, మూడు రాజధానులు ఓ దుర్మార్గం’ అని ఏపీ బీజేపీ నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటుంది. తమకు భూములున్నాయని కాదు గానీ.., సుజనా చౌదరి, కన్నా లక్ష్మినారాయణ, కొత్త కాషాయ కార్యకర్త పవన్ కల్యాణ్ ఎడాపెడా జగన్‌ను ఆడిపోసుకుంటూ సహజంగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ హైకమాండ్ మాత్రం జగన్‌ను ‘ఎన్డీయేలోకి రా, రా’ అని పిలుస్తూ ఉంటుంది… సేమ్… కేసీయార్..!
రా రమ్మని.. రారా రమ్మని:
తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ కొనసాగుతూ ఉంటుంది. కానీ జగన్‌ను పిలిచినట్టే కేసీయార్ ను కూడా రారమ్మని పిలుస్తున్నది బీజేపీ హైకమాండ్. ఒవైసీ ఎజెండాతో బీజేపీ మీద జాతీయ స్థాయి పోరాటం చేస్తానంటూ ఉత్సాహం ప్రదర్శిస్తున్న కేసీయార్ దానికి సై అంటాడా..? తిరస్కరిస్తాడా..? ఓకే అనే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కేసీఆర్ ‘ఐక్యూ లెవల్’ చాలా ఎక్కువ.
జమిలీ ఎన్నికలకై..:
మొన్న ప్రధాని మోడీతో జగన్ భేటీలో మోడీ ఓ మాట చెప్పాడు. జగనే కొందరు తన పార్టీ ముఖ్యులతో షేర్ చేసుకున్న సమాచారమే..! 2023లో కాదు, 2022లోనే జమిలి ఎన్నికలు ఉంటాయి అని..! ఆ దిశలో అడుగులు అంత ఈజీ టాస్క్ కాదు. కానీ బీజేపీ అటువైపు అడుగులు వేయాలని అనుకుంటున్నది. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తేనే తనకు రాష్ట్రాలు, కేంద్రంలో మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నది. అది జరగాలంటే తనకు బలమైన ప్రాంతీయ పార్టీల సపోర్ట్ కావాలి. కాంగ్రెస్ ను, మమత వంటి ‘హార్డ్ కోర్’ మోడీ వ్యతిరేకులను తొక్కేయాలి. సో, దక్షిణాదిన తనకు అవసరం స్టాలిన్, జగన్, కేసీయార్. అసలే ఈ ముగ్గురూ కలిసి మొన్నటి ఎన్నికల ముందు తనకు వ్యతిరేకంగా చాలా ప్రయత్నాలు చేశారు. ఇక వారిని కలిపేసుకోవాలి. తను అనుకున్న దిశలో అడుగులు వేయాలి. తప్పదుమరి.
లాజికల్ ప్లే..:
జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలు అంటే బీజేపీ బెటర్ పర్ ఫారమ్ చేస్తుంది. అది కేసీయార్ కూ తెలుసు, అందుకే మొన్న లోకసభ ఎన్నికలకు ముందే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ‘లాజిక్’గా వెళ్లాడు. లోకసభ ఎన్నికలొచ్చేసరికి తాను అనుకున్న సీట్లలో ఏడు తగ్గిపోయాయి… మరి ఇప్పుడు ‘జమిలి ఎన్నికలు’ అనే బీజేపీ ఆలోచనకు ‘తనెలా స్పందిస్తాడు’ అనేది వేచి చూడాలి మరి. రాజకీయాలంటే ఎప్పుడూ శతృత్వమూ ఉండదు, మిత్రత్వమూ ఉండదు. అవసరాల మేరకే సర్దుబాట్లు ఉంటాయ్. అది పరిస్థితులను బట్టి ఉంటుంది.
చెల్లి కవితమ్మకు పదవి..!:
నిజానికి రాష్ట్ర స్థాయిలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరాటం కనిపిస్తున్నా… లోలోపల ఆ పార్టీల నడుమ కేంద్ర స్థాయిలో అంత ఘోరంగా సంబంధాలు ఏమీ చెడిపోలేదు. తన కూతురు కవితను రాజ్యసభకు పంపించి, వీలయితే కేంద్ర మంత్రిని చేయాలనే అభిలాష కేసీయార్ లోనూ ఉందని అంటుంటారు. ఈ నేపథ్యంలో కేసీయార్, మోడీ భేటీపై ఆసక్తి నెలకొంది. ‘నోట్ల రద్దు వంటి విషయాల్లో మోడీకి సపోర్ట్ చేసి తప్పు చేశాం.. పశ్చాత్తాపపడ్డాం’ అని కేటీఆర్ అంటున్నాడు. బీజేపీ వ్యతిరేక ప్రకటనలే చేస్తున్నాడు. కానీ ఈ ధోరణి ఇలాగే ఉండాలని ఏమీ లేదు. ఉండదు కూడా. కేసీఆర్- మోడీ భేటీ రాష్ట్ర రాజకీయాల దశను ఏమైనా మార్చే చాన్సుందా..?! ఉంది. ఉంటుంది. దటీజ్ పోలిటికల్ స్టెప్స్.