తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు, జర్నలిస్టుల సంస్థల మీద ఎలా దాడులు జరుగుతున్నాయి… ప్రభుత్వాధినేతలు ఎలా వెంటపడి కేసులు వేస్తూ వేధిస్తున్నారు, మీడియా లెజెండ్ రవిప్రకాశ్ కేసులలో పోలీసులు, ప్రభుత్వం ఎందుకంత ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి, ఎలా కేసులు వెతుకుతూ… వెంటాడుతున్నారు, ఏపీలో జర్నలిస్ట్‌లపై వేట ఎలా కొనసాగుతోంది, చంపేందుకు కూడా వెనకాడకపోవటంపై ‘ఆధాబ్ హైదరాబాద్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం తొలివెలుగులో యాధావిధిగా…
తెలుగు రాష్ట్రాల్లో నలుగుతున్న పాత్రికేయం
అక్కడ రాధాకృష్ణ.. ఇక్కడ రవిప్రకాశ్
◆ ఆంధ్రజ్యోతి స్థలం స్వాధీనం
◆ మరో కేసులో పీటీ వారెంట్
◆ ‘తుని’ హత్యలో వైకాపా ఎమ్మెల్యేపై కేసు
◆ ముందే హెచ్చరించిన ‘ఆదాబ్’
నలుగురికి న్యాయం జరగాలని తపించే కలం నలిగిపోతుంది. కాదు నలిపేసి… నులిమేస్తున్నారు. తెగిస్తున్న నాయకులు ఏకంగా జర్నలిస్టుల తలలు నరకడానికే తెగబడుతున్నారు… అధినాయకుల సలహాలతో హత్యలకే పూనుకుంటున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపైనే ఆరోపణలు. సాగదీసే కేసులు. మీడియాలోకి ఆర్ధిక మాఫియా రావాలని భావించి… ఇష్టారాజ్యంగా ఛానళ్ళు కొనేయటం. అందులోని జర్నలిస్టులను తరిమి, తరిమి కొడుతోంది. వినకుంటే జైళ్ళు. అప్పటికీ వినకుంటే ‘చైన్ సిస్టం’ కేసులు. మరోవైపు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని వెంటాడి వేటాడుతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఊసరవెల్లులు సైతం సిగ్గుపడే రీతిలో నాయకులు మారుతున్నారు. జర్నలిస్టులు కూడా అలా మారాలని అధికార ప్రబుధ్దులు భావిస్తున్నారు. తలొగ్గని తలలపై నిలువెత్తు గునపాలు అడ్డంగా దించేస్తున్నారు. ఆంధ్రాలో ఆంధ్రజ్యోతికి కేటాయించిన స్థలం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో టివి9 రవిప్రకాశ్ పై కేసుల పరంపర చెట్టుకు వేళాడే ‘బేతాళుడి’ కథలా సాగిపోతుంది. ఈ విషయాలు జరగబోతున్నాయని ‘ఆదాబ్ హైదరాబాద్’ పలు కథనాల ద్వారా చెప్పింది. ఇప్పుడు అదే అక్షరాలా జరిగింది.
రవికి అదనపు సంకెళ్ళు:
టివి9 యాజమాన్యం- రవిప్రకాశ్ ల మధ్య గత కొద్ది నెలలుగా ఆర్ధిక పరమైన అంశాలు వివిధ న్యాయస్థానాలలో ఉన్నాయి. అయితే మొదటి కేసులో ఆయన అష్టకష్టాలు పడి.. ‘సుప్రీం’ వరకు వెళ్ళి, హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందారు. ప్రత్యర్ధులు సహజంగా తమ వనరులన్నీ ఉపయోగించుకొని మరో కేసు ‘బోనస్’గా ఇచ్చారు. ఆయనను జైలుకు పంపించాలనే కోరిక ‘కసిదీరా’ కొంత తీర్చుకున్నారు. ఈ కేసులో ఆయనకు కోర్టు కస్టడీ నిరాకరించడంతో ఆయన సన్నిహితులు అంతా బెయిల్ వస్తుందనుకున్నారు.
ఉంచాలనుకున్నారు.. ఊహించెసుకున్నారు..:
రవిప్రకాశ్ ఈసారి దీపావళి జరుపుకోకూడదని ‘ఉద్దండపిండాలు’ భావించాయి. ఇంకొద్ది గంటల్లో బెయిల్ తప్పక వస్తుందనుకునే లోపు… వేగంగా కదిలారు. డమ్మీలు వచ్చారు. నాట్యం చేసుకుంటూ నటరాజ్ వచ్చాడు. చంకలు గుద్ధుకుంటూ సంతోష్ గౌడ్ వచ్చాడు. ఊహించిన ఊహాలకు ప్రాణం పోశారు. తెల్ల పేపర్ నల్లగా అయింది.
హడావుడిగా ఐటీ కేసు:
రవిప్రకాష్ పై నకిలీ ఐడీ తయారు చేసినట్లు మరో కేసు నమోదయింది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద రవిప్రకాశ్.. ఫేక్ ఐడీ తయారు చేసినట్టుగా పోలీసులు వేగంగా పరిశోధించి తేల్చారు. రవిప్రకాశ్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 406/66 యాక్ట్ కింద కేసు పెట్టినట్టు చెప్పారు. కోర్టులో హాజరు పర్చారు. రొటీన్ తతంగం.
ఇక సంజీవిని వంతు..:
‘బోనస్’గా ఒకేసారి వచ్చిన డబ్బును రవిప్రకాశ్ మానవతా దృక్పథంతో సంజీవినీ ఆసపత్రికి రెండు కోట్లు విరాళంగా ఇచ్చారు. వాళ్ళు కృతజ్ఞతతో రవిప్రకాశ్ పేరు కలిపి వాడుకలోకి వచ్చారు. ఇప్పుడు ముష్కరుల కళ్ళు అటు వైపు పడ్డాయని తెలిసింది. అంటే తుప్పు పట్టిన ఆలోచనలకు మసిపూసి మరోకేసు పెడతారేమో…!
‘ఆంధ్రజ్యోతి’కి ఆర్థిక దెబ్బ
◆ స్థల స్వాధీన వివాదం
విశాఖ శివారున పరదేశిపాలెంలో రూ.కోట్ల విలువైన 1.50 ఎకరాల స్థలాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్య సంస్థ అయిన ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేవలం రూ.50 లక్షల 5వేలకే ఇచ్చేస్తూ.. 2017 జూన్ 28న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి ముందు 1986లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి ప్రెస్ కు పరదేశిపాలెం గ్రామ పరిధి సర్వే నెం.191, 168లలో ఎకరా రూ.10వేల ధరకు 1.50ఎకరాల భూమి కేటాయించింది. అయితే కొన్నాళ్లకు జాతీయ రహదారి విస్తరణ కోసం ఇందులో ఎకరా భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన 50 సెంట్ల భూమి అప్పటి నుంచి ఆ సంస్థ అధీనంలోనే ఉంది. జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16) కోసం స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా వేరే భూమి ఇవ్వాలని, 1986లో తమకు కేటాయించిన ధరకే ఎకరా రూ.10వేల చొప్పున రేటు నిర్ణయించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం 2016లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరింది. స్పందించిన సర్కారు అదే ప్రాంతంలో ఒకటిన్నర ఎకరాల భూమిని గుర్తించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. పరదేశిపాలెం సర్వేనంబర్ 191/10 నుంచి 191/14లో అందుబాటులో ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల వలవన్ 2017 జూన్ 28న జీవో ఎంఎస్. 25ను జారీ చేశారు. 0.50 సెంట్ల భూమిని పాత ధర కింద ఎకరా రూ.10వేల రేటుతో, ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ఎకరా భూమిని ఎకరా రూ.50 లక్షల రేటుతో కేటాయించాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇచ్చారు. ఇప్పుడు బలహీనవర్గాలకు కేటాయించేలా మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం తీవ్రంగా ఖండించింది.
లంచ్ మోషన్ పిటీషన్:
పరదేశిపాలెంలో ఆమోద పబ్లికేషన్స్‌కు ఇచ్చిన స్థలాన్ని తిరిగి తీసుకోవాలన్న కేబినెట్ నిర్ణయంపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ తరపున హైకోర్టు న్యాయవాది సుబ్బారావు వాదించారు. చట్టపరమైన, విధానపరమైన ప్రక్రియను అనుసరించకుండా హడావుడిగా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి హైకోర్టు వీల్లేదని తెలిపింది. ఆమోద పబ్లికేషన్స్‌కు ఇచ్చిన స్థలంలో మూడేళ్లలోపు నిర్మాణం చేయాలని 2017లో ఇచ్చిన జీవోలో అప్పటి ప్రభుత్వం పేర్కొంది. మూడేళ్లు కాకుండానే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
పాత్రికేయుడి హత్య – వైకాపా ఎమ్మెల్యేపై కేసు:
తూర్పుగోదావరి జిల్లా తునిలో పాత్రికేయుడు కాటా సత్యనారాయణ హత్యకు సంబంధించి పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సత్యనారాయణ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాత్రి తుని మండలం ఎస్.అన్నవరం గ్రామ పరిధిలో సత్యనారాయణ హత్యకు గురయ్యారు. ఆంధ్రజ్యోతి పత్రికకు తొండంగి మండల విలేకరిగా పని చేస్తున్న ఆయన.. టి.వెంకటాపురం నుంచి ఎస్.అన్నవరం వస్తున్న సమయంలో హత్య జరిగింది.