ఏపీలో మరో పరిశ్రమ తరలిపోయింది - Tolivelugu

ఏపీలో మరో పరిశ్రమ తరలిపోయింది

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)

ఏపీలో మరో పరిశ్రమ తరలిపోయింది

◆ భూమి ఇవ్వక పీఈఎల్
◆ ఎయిర్ ఏషియా సేవల నిలిపివేత
◆ రాజధాని రాద్దాంతం కారణమా..?

గత కొన్ని రోజులుగా కియా పరిశ్రమ గురించి జరుగుతున్న ప్రచారం, దాని పై అధికార పక్షం, ప్రతిపక్షం చేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు ఏం సాధించలేదని చెప్పే వైసీపీ నాయకులే… కియో సంస్థ ఘనత గురించి చెప్పటం విడ్డూరమే..! అది ఉంటుందా..? లేదా..? అన్నది కాలం చెపుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని రాద్దాంతం ఎట్టకేలకు ఇతర రంగాల వైపు పరోక్షంగా కాదు. ప్రత్యక్షంగా పడుతోంది. దానికి తాజా ఉదాహరణనే నెల్లూరు జిల్లా నుంచి తరలిపోయిన రూ. 500 కోట్ల విలువైన ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ లిమిటెడ్‌ (పీఈఎల్‌) పరిశ్రమ. ఇదిలా ఉండగా విశాఖపట్నం నుంచి వైమానిక సేవలు అందిస్తున్న ‘ఎయిర్ ఏషియా’ తన కోల్ కత్తా విమానాలను నిలిపి వేసి ఏపీకి మరో ‘షాక్’ ఇచ్చింది. నాయకుల్లారా… మీ రాజకీయాలు మీరు చేసుకోండి. వర్షాకాలంలో ‘వెలసిన రంగుల హోళీ’ సంబురాలు చేసుకొండి. ఇళ్ళ దగ్గర చచ్చిన కోళ్ళను కసా.. బిసా.. చేసుకోండి.. ‘కొత్త పరిశ్రమల మాట దేవుడు ఎరుగు’. ఉన్న పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోకుండా చూడాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ విషయాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

అసలేం జరిగింది:
నెల్లూరు జిల్లా, శిరసనంబేడు మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ లిమిటెడ్‌ ( పీఈఎల్‌) పరిశ్రమ తరలి పోయింది. 2016లో 250 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకున్న ఈ పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించక పోవడంతో యాజమాన్యం నైరాశ్యంలో ఉండిపోయింది. కొత్త ప్రభుత్వంలోనూ భూముల కోసం ప్రయత్నించింది. ఇక్కడి భూములకు పరిహారం ఇవ్వకపోవడంతో ఓజిలి మండలంలోని మాచవరంలో ప్రభుత్వ భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈప్రాంత పాలకులు శ్రద్ధ చూపకపోవడంతో రూ. 500 కోట్ల పెట్టుబడి పరిశ్రమ తరలి పోయింది. దీంతో వేలాది మందికి ఉపాధి దూరమవుతోంది.

విశాఖలో ఆ విమాన సేవలు నిలిచి ‘పోతాయా’..?:
మాములుగా విమాన ప్రయాణం అంటే గమ్యస్థానాన్ని తొందరగా చేరుకోటానికి ఉపయోగిస్తాం. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న విమానాశ్రయాల్లో విశాఖపట్నం అతి పెద్ద విమానాశ్రయం. ఇక్కడ నుంచి ప్రతిరోజు వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ప్రయాణికులకు ఎయిర్ ఏషియా సంస్థ షాక్ ఇచ్చింది. మాములుగా విమాన ప్రయాణం చెయ్యాలంటే ముందుగా బుక్ చేసుకుంటారు. కానీ ఆ సంస్థ ప్రయాణికులకు షాక్ ఇస్తూ విశాఖపట్నం నుంచి కోల్ కత్తా వెళ్ళవలసిన నాలుగు విమానాల సేవలను నిలిపి వేసింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

పునరుద్దరించరూ..ప్లీజ్:
ఇదే విషయమైన స్పందిస్తూ ‘రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపటానికి కొత్త విమనాలను ఎలాగు వచ్చేలా చేయటం లేదు. కనీసం ఉన్న వాటినైనా వెళ్లిపోకుండా చూడండి’ అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ సమస్య పై ముఖ్యమంత్రి జగన్, సంస్థ యజమానులు స్పందించి వెంటనే విమాన సేవలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ముగింపు:
కియో పోయిందంటూ.. ఒకరు.. పోలేదంటూ మరొకర..’కుయ్యే.. మొర్రో’లు ఇక్కడ అసందర్భం. కానీ ‘ఆదాబ్’ చెపుతున్న ఈ రెండు ఉదంతాలు తప్పు.. తప్పు అని అరచి గీ పెట్టమాకండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా… చెన్నై నుంచి కర్నూలు ‘టెంటు రాజధాని’, అక్కడి నుంచి హైదరాబాద్, అక్కడ నుంచి అమరావతి, ఇప్పుడు మూడు ముక్కలాట. ఇది వారి మీ అదృష్టమా? దురదృష్టమా..? నాయకులారా.. మీ పరమ ‘పదవుల’ సోపాన పటంలో మీకు నిచ్చెనలు.. ప్రజలకు పాములు.

Share on facebook
Share on twitter
Share on whatsapp