మోడీ సర్కార్ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ జీ బెస్ట్ ఫ్రెండ్ అదానీకి సంబంధించిన మెగా స్కామ్ పై దర్యాప్తు చేయాలని తాము ఈడీకి లేఖను అందించబోతున్నామని ఆయన తెలిపారు. కానీ తమను బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు.
ప్రతిపక్ష పార్టీలపై నిరంతరం దాడులు చేసే ఈడీ ప్రధాని మోడీ మిత్రుడి చిరునామాను ఎందుకు మరచిపోయింది? అని ఆయన ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేసేందుకు విపక్షాలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ లోని ఈడీ కార్యాలయానికి నిరసన ర్యాలీగా బయలు దేరారు.
వారిని పోలీసులు విజయ్ చౌక్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అదానీ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేయాలని 18 పార్టీ భావిస్తున్నాయని చెప్పారు. కానీ దానికి బీజేపీ ప్రభుత్వం అనుమతివ్వడం లేదని ఆయన పేర్కొన్నారు.
అదానీ వ్యవహారంపై సంపూర్ణ దర్యాప్తు కోసం ఈడీకి ఫిర్యాదు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు తాము ప్రయత్నిస్తూనే ఉంటామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఖర్గే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ ను ఆపాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు.