అదానీ గ్రూప్ కు చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం దలాల్ స్ట్రీట్ లో ఢమాల్ అన్నాయి. రెండు సిమెంట్ కంపెనీల షేర్ల పరిస్థితి కూడా ఇదే ! అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు దాదాపు 6 శాతం మేర తగ్గగా.. అదానీ ట్రాన్స్ మిషన్ 17 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సుమారు 10 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 15 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం కుదేలయ్యాయి. అదానీ విల్మార్ అండ్ అదానీ పవర్ 5 శాతానికి దిగజారింది. ఇక ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీల షేర్లు 9 నుంచి 11 శాతం పడిపోయాయి.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి షేర్ ధరలు కోలుకోని పక్షంలో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీ దెబ్బను ఎదుర్కోకతప్పదని తెలుస్తోంది. గత బుధవారమే ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష రూపాయలవరకు నష్ట పోయింది. ఇక శుక్రవారంనాటి విషయానికి వస్తే క్యుమ్యులేటివ్ మార్కెట్ షేర్ రూ. 2.37 లక్షల కోట్లు ఆవిరైనట్టు అంచనా.
అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూపు కంపెనీల ఫ్రాడ్ గురించి షాకింగ్ విషయాలను ఓ నివేదికలో బహిర్గతం చేయగానే అదానీ లిస్టెడ్ గ్రూపు కంపెనీల షేర్లు ఢమాల్ అంటూ వచ్చాయి. ఇన్వెస్టర్లలో ఇదివరకెన్నడూ లేని భయాందోళనలు నెలకొన్నాయి. దశాబ్దాలుగా ఈ సంస్థలు స్టాక్ మానిప్యులేషన్ కు, ట్యాక్స్ కి సంబంధించి పలు అవకతవకలకు పాల్పడుతూ వచ్చాయని హిండెన్ బెర్గ్ తన రిపోర్టులో ఆరోపించింది.
అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, నిరాధారమైనవని, దురుద్దేశంతో కూడుకున్నవని అదానీ గ్రూప్ కొట్టి పారేసింది. ఇలాంటి ఆరోపణలు చేసినందుకు హిండెన్ బెర్గ్ పై కోర్టులో దావా వేస్తామని హెచ్చరించింది. కానీ హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్థ కూడా ఇందుకు తాము సంసిద్ధమేనని సవాలు చేసింది.తమవద్ద అన్ని ఆధారాలూ, డాక్యుమెంట్లు ఉన్నాయని, మీరు భారత లేదా అమెరికా చట్టాల కింద కోర్టులో మాపై దావా వేసుకోవచ్చునని కౌంటరిచ్చింది. తమ రిపోర్టుకు కట్టుబడే ఉన్నామని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ ఆరోపణల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఈ పార్టీ ఆరోపించింది.