అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. బ్లూమ్ బర్గ్ బిలియనర్ల జాబితాలో ఆయన 29వ స్థానానికి పడిపోయారు. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ షేర్ల పతనం మొదలు కాగా ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించినట్టు అనిపించింది. ఆ తర్వాత మళ్లీ కొత్త వార్తలు రావడంతో అదానీ గ్రూప్ షేర్లు మరింత పతనమయ్యాయి.

ఓ వైపు స్టాక్ మార్కెట్ల ప్రతికూల పరిస్థితులు, మరోవైపు వికిపీడియా ఆరోపణలతో అదానీ కంపెనీల షేర్ల అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఒక్క రోజే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 51,294 కోట్ల వరకు ఆవిరైనట్లు అంచనా. అందులో అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా 10.4 శాతం నష్టపోయినట్టు తెలుస్తోంది.
హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో గత నెల 25న అదానీ గ్రూప్ షేర్ల పతనం ప్రారంభం అయింది. సుమారు నెల రోజుల్లోనే మార్కెట్ విలువ రూ.11 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది. ఈ నెల రోజుల్లోనే అదానీ సంపద 60 శాతానికి పైగా విలువ ఆవిరైనట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ముంద్రాలో భారీ ప్లాంట్ నిర్మాణంపై సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి ప్లాంట్ నిర్మాణ ప్రణాళికలను పునఃసమీక్షించనున్నట్లు అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేశిందర్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం గ్రూప్ కంపెనీలు మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయన్నారు. అందువల్ల ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులను చేపట్టబోమని స్పష్టం చేశారు.
మరోవైపు కొత్త రోడ్డు ప్రాజెక్టులకు కూడా తాము బిడ్లు దాఖలు చేయబోమని తెలిపారు. ఈ ప్రకటన కూడా షేర్ల నష్టాల్లో భాగమైందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్నాయని జుగేశిందర్ పేర్కొన్నారు.