తాము ఫ్రాడ్ కి పాల్పడ్డామని, పన్నులు ఎగ్గొట్టామని అమెరికాలోని హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అదానీ గ్రూప్.. ఈ సంస్థపై కోర్టుకెక్కే యోచనలో ఉన్నామని గురువారం వెల్లడించింది. హిండెన్ బెర్గ్ రీసెర్చ్ రిపోర్టు కారణంగా ఏడు అదానీ గ్రూపు లిస్టెడ్ కంపెనీల క్యుమ్యులేటివ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న కుదేలై సుమారు లక్ష కోట్లు ఆవిరయ్యాయి. హిండెన్ బెర్గ్ నివేదిక లోని ఆరోపణలను, దీని టైమింగ్ ని ఖండిస్తూ అదానీ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తాజాగా ఈ గ్రూప్ లీగల్ హెడ్ జతిన్ జలుంద్ వాలా .. మళ్ళీ వీటిని తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు దురుద్దేశపూరితమైనవి, నిరాధారమైనవని, వీటి వల్ల మా షేర్ హోల్డర్లు, ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారని ఆయన చెప్పారు. ఈ రిపోర్టు భారతీయ స్టాక్ మార్కెట్లలో కలవరాన్ని లేవనెత్తింది.. భారతీయ పౌరుల్లో ఎనలేని భయాన్ని కలిగించింది అని ఆయన అన్నారు.
అదానీ గ్రూపు కంపెనీల షేర్ వ్యాల్యూలను దెబ్బ తీయాలన్న దురుద్దేశం ఈ రిపోర్టులో స్పష్టంగా కనిపిస్తోందని, ఏదో ప్రయోజనం పొందాలనుకుంటున్నట్టు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, శుక్రవారం మేం ప్రకటించబోయే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ని దెబ్బ తీసేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోందన్నారు.
ఇక అమెరికా, భారతీయ చట్టాల కింద హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్థపై కోర్టులో దావా వేసే విషయాన్ని ఆలోచిస్తున్నామని జతిన్ జలుంద్ వాలా తెలిపారు. ఆ సంస్థ విదేశీ ఎంటిటీ సంస్థ అని ఆయన ఆరోపించారు.