ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచడానికి అదానీ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ప్రమోటర్లు 1,114 మిలియన్ డాలర్లను రుణ సంస్ధలకు ముందుగానే చెలిస్తారని ప్రకటించింది. అంటే 2024 సెప్టెంబరు వరకు గడువు ఉన్నప్పటికీ.. మెచ్యురిటీకి ముందే ఈ సొమ్ముకు సంబంధించిన ప్రీ-పే మొత్తాలను చెల్లిస్తామని వెల్లడించింది. ప్రమోటర్ల నిబధ్ధతను దృష్టిలో నుంచుకొని తన సంస్థల లోని ప్లెడ్జ్డ్ షేర్లను విడుదల చేస్తామని వివరించింది.
ఈ షేర్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్లకు సంబంధించినవి. ముందస్తుగానే చెల్లిస్తామన్న ప్రమోటర్ల హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, ఈ విషయాన్నీ తెలియజేయడానికి సంతోషిస్తున్నామని ఈ గ్రూప్ పేర్కొంది.
ప్రీ-పేమెంట్ ప్రకారం అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కి చెందిన 168.27 మిలియన్ షేర్లను రిలీజ్ చేయనున్నారు. ఇది 12 శాతమని వివరించింది. అదానీ గ్రీన్ విషయానికి వస్తే 27.56 మిలియన్ షేర్లను (3 శాతం), అదానీ ట్రాన్స్ మిషన్ కి సంబంధించి 11.77 మిలియన్ షేర్లను (1.4 శాతం) విడుదల చేయనున్నారు.
ఇన్వెస్టర్ల ఆందోళనను తగ్గించడానికి అదానీ గ్రూప్ తీసుకున్న నిర్ణయంగా దీన్ని భావిస్తున్నారు. ఈ ప్రకటనతో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్లు సుమారు 9 శాతం పెరిగాయి. అలాగే అదానీ ఎంటర్ ప్రైజెస్ కూడా కొంతవరకు కోలుకుంది. కానీ అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ట్రాన్స్ మిషన్ అండ్ అదానీ విల్మార్ షేర్లు ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.