తమ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచేందుకు అదానీ గ్రూప్ మళ్ళీ నడుం కట్టింది. రేపటిలోగా తాము గ్లోబల్ బ్యాంకులకు చెల్లించవలసిన రూ. 4 వేలకోట్ల (500 మిలియన్ డాలర్లు) రుణాన్ని తిరిగి చెల్లించిందని ఈ గ్రూపు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నిధులను నిన్న విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. హిండెన్ బెర్గ్ రిపోర్టు అనంతరం కొన్ని బ్యాంకులు అదానీ సంస్థలకు రుణాలు మంజూరు చేసేందుకు వెనుకంజ వేశాయి.
అయితే షేర్ ఆధారిత లోన్స్ లో 16 వేల కోట్లను ముందుగానే అదానీ గ్రూప్ చెల్లించింది. సకాలంలో బాండ్ రీపేమెంట్ చేసింది కూడా. పైగా స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ కి చెందిన గాగ్ పార్ట్ నర్స్ నుంచి మరో 15 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించగలిగింది.
దీంతో దాదాపు 10 లక్షల కోట్ల మార్కెట్ నష్టాల్లో కొంతవరకు భర్తీ చేసుకున్నట్టు ఆ ప్రతినిధి వెల్లడించారు. సుమారు 12 లక్షల కోట్లకు పైగా నష్టాలను అదానీ గ్రూప్ చవి చూసినట్టు లోగడ వార్తలు వచ్చాయి
గ్లోబల్ బ్యాంకులు ఈ పారిశ్రామిక దిగ్గజ ఆధీనంలోని గ్రూప్ కి సుమారు 36 వేల కోట్ల రుణాలను మంజూరు చేశాయి. గత ఏడాది హోలిసిమ్ లిమిటెడ్ సిమెంట్ ఆస్తుల కొనుగోలుకు గాను అదానీ ఈ రుణాన్ని సేకరించారు. ఇందులో కొంతమేర రుణ కాల పరిమితి రేపటితో ముగియనుంది. తదుపరి రుణాన్ని 2024 లో అదానీ గ్రూప్ చెల్లించాల్సి ఉంది.