2023-24 సంవత్సరానికి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించిన అనంతరం అసలే అంతంత మాత్రంగా ఉన్న అదానీ గ్రూప్ షేర్లు ఢమాల్ అన్నాయి. ఆయన కంపెనీలు దలాల్ స్ట్రీట్ లో ఎన్నడూ ఎదుర్కోని భారీ క్రాష్ పరిస్థితినెదుర్కొన్నాయి. ఇటీవలే అదానీ ఎంటర్ ప్రైజెస్ విజయవంతంగా 20 వేల కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ బిడ్ ని దక్కించుకున్నప్పటికీ ఆ ఆశలు ఆట్టే కాలం నిలవలేదు.
మార్జిన్ రుణాలకు గాను కొల్లేటరల్ నిధులుగా అదానీ కంపెనీల బాండ్లను అంగీకరించడానికి ‘క్రెడిట్ సూస్సే’ నిరాకరించిందన్న సమాచారంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు 30 శాతం క్రాష్ అయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బీ ఎస్ పీ సెన్సెక్స్ 300 పాయింట్లకు, ఎన్ ఎస్ ఈ నిఫ్టీ 50 పాయింట్లకు దిగజారినా కొద్దిసేపటికే పుంజుకున్నాయి.
అదానీ గ్రూపు స్టాక్స్ లో ఒడిదుడుకులే ఇందుకు కారణమయ్యాయి. అదానీ గ్రూప్ లోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు దిగజారడం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ గ్రూప్ లోని 4 స్టాక్స్ అయితే కుప్పకూలడం టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నే దెబ్బ తీసింది.
అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం, అదానీ పవర్ 4.98 శాతం, అదానీ విల్మార్ 5 శాతం, ఎన్డీటీవీ 5 శాతం లోయర్ సర్క్యూట్లతో ఢమాల్ మన్నాయి. ఇంకా అదానీ గ్రీన్ ఎనర్జీ 9 శాతం, అంబుజా సిమెంట్ 14 శాతం, ఏసీసీ సిమెంట్ 5 శాతం తగ్గడంతో దలాల్ స్ట్రీట్ దిక్కుతోచని స్థితిలో పడింది. ఇండియన్ మార్కెట్లపై ఈ పరిణామాలన్నీ తీవ్ర ప్రభావం చూపడమే గాక.. ప్రపంచంలోనే అత్యధిక కుబేర సంపన్నుడిగా పేరు గాంచిన అదానీ స్థానం దిగజారిపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.